అవినీతి ఆరోపణలు: బుల్లెట్‌ ట్రైన్‌ బాస్‌పై వేటు

8 Jul, 2022 14:43 IST|Sakshi

న్యూఢిల్లీ: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని విధులనుంచి తొలగించింది కేంద్రం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఎండీ సతీష్  సేవలను రైల్వే శాఖ రద్దు చేసినట్లు సీనియర్ అధికారులు నిన్న( గురువారం) తెలిపారు. అలాగే ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు మూడు నెలల పాటు ఈ  బాధ్యతలు అప్పగించినట్లు  వెల్లడించారు.

అధికార దుర్వినియోగం, నిధులను అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి మళ్లించడం లాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో అగ్నిహోత్రిపై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్  సీఎండీగా  తొమ్మిదేళ్ల పదవీకాలంలో ఒక ప్రైవేట్ కంపెనీతో కుదుర్చుకున్న "క్విడ్ ప్రోకో" డీల్ ఆరోపణలువెల్లువెత్తాయి. దీనిపై జూన్ 2న లోక్‌పాల్ కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయననను తొలగించేందుకు నిర్ణయించినట్లు వారు  తెలిపారు. 

అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నేరం జరిగిందో లేదో నిర్ధారించుకోవడంతోపాటు, విచారణ నివేదికను ఆరు నెలల్లోగా లేదా డిసెంబర్ 12, 2022 లోపు సమర్పించాలని లోక్‌పాల్ సీబీఐని ఆదేశించింది. అలాగే అగ్నిహోత్రి పదవీ విరమణ చేసిన ఒక సంవత్సరంలోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం తీసుకున్నారని కూడా అధికారులు ఆరోపించారు. రిటైర్డ్ అధికారులు కేంద్రం ఆమోదం లేకుండా పదవీ విరమణ తరువాత ఏడాది దాకా ఎలాంటి వాణిజ్య ఉద్యోగాలను స్వీకరించకూడదన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించారని పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలపై అగ్నిహోత్రి అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ అరోపణలను అతని సన్నిహితులు తీవ్రంగా ఖండించారు. 1982 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌ఈ అధికారి, అగ్నిహోత్రి  2021జూలై లో ముంబై, అహ్మదాబాద్‌ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిసీఎల్‌లో  చేరారు.  అంతకుముందు  ఆర్‌వీఎన్‌ఎల్‌  సీఎండీగా  ఉన్నారు.   

మరిన్ని వార్తలు