భారత మార్కెట్‌పై అమెజాన్‌ బుల్లిష్‌

17 Jun, 2022 06:48 IST|Sakshi

స్థానిక చట్టాలను అనుసరిస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: భారత మార్కెట్‌ పట్ల తాము సానుకూలంగా (బుల్లిష్‌) ఉన్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు, ఎంఎస్‌ఎంఈల డిజిటైజేషన్‌ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ‘‘వచ్చే ఆరు నెలల్లో మేము ఎంత పెద్ద, మెరుగైన సంస్థో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

భారత్‌లో కొనుగోళ్లు, విక్రయాలను పూర్తిగా మార్చాలన్న మా లక్ష్యం దిశగా పనిచేస్తూనే ఉన్నాం’’అని అమెజాన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ (కన్జ్యూమర్‌ బిజినెస్‌) మనీష్‌ తివారీ పేర్కొన్నారు. ఫ్యూచర్‌ గ్రూపులో అమెజాన్‌ పెట్టుబడుల ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధం అంటూ సీసీఐ ఇచ్చిన తీర్పును అమెజాన్‌ ఎన్‌సీఎల్‌టీలో సవాలు చేయగా.. అక్కడ ప్రతికూల తీర్పు రావడం తెలిసిందే. సీసీఐ తీర్పును సమర్థిస్తూ, అమెజాన్‌ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించడం తెలిసే ఉంటుంది. సీసీఐ రూ.200 కోట్ల పెనాల్టీని కూడా ఎన్‌సీఎల్‌టీ సమర్థించింది. దీనిపై మాట్లాడేందుకు తివారీ తిరస్కరించారు. కోర్టు ఆదేశాలను సంబంధిత వ్యక్తులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  

వేగంగా వృద్ధి
అమెజాన్‌ 9 ఏళ్ల క్రితం 100 విక్రయదారులు, ఒక గోదాముతో సేవలు మొదలు పెట్టింది. ఇప్పటికి తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల సంఖ్యను 11 లక్షలకు పెంచుకుంది. 23 కోట్ల ఉత్పత్తులను విక్రయానికి ఉంచింది. గోదాములు 60కి చేరాయి.

మరిన్ని వార్తలు