Bumper To Bumper Insurance: అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?

28 Aug, 2021 15:47 IST|Sakshi

వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? 

బంపర్‌ టూ బంపర్‌
లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్‌ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. 

ప్రీమియం ఎంత పెరుగుతుంది?
కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్‌ చేయించేప్పుడే థర్డ్‌ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్‌ప్రైస్‌లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్‌వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది.

ఆర్థిక భారం ఎంతంటే ?
ఐదేళ్ల కాలానికి బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సును లెక్కించందుకు  హ్యుందాయ్‌ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది.

వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ?
కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్‌ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్‌ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్‌ టూ బంపర్‌ రెండేళ్లు థర్డ్‌ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్‌ప్రైస్‌ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే  ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది.

ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ?
ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్‌ ఆధారంగా థర్డ్‌పార్టీ లేదా బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు.  

చదవండి : బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌ తప్పనిసరి..మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు