బర్గర్‌ కింగ్‌ లిస్టింగ్.. అ‘ధర’హో

14 Dec, 2020 10:12 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఈలో రూ. 51 లాభంతో రూ. 111 వద్ద లిస్టింగ్‌

ఇష్యూ ధర రూ. 60- తద్వారా రూ. 810 కోట్ల సమీకరణ

దాదాపు 157 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయిన ఇష్యూ

ఐపీవో నిధులతో విస్తరణ, బర్గర్‌ కింగ్ రెస్టారెంట్స్‌ ఏర్పాటు

ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్‌(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌ కింగ్‌ తొలి రోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 85 శాతం ప్రీమియంతో రూ. 111 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. వెరసి రూ. 51లాభంతో లిసయ్యింది. తదుపరి రూ. 119 వరకూ ఎగసింది. ప్రస్తుతం రూ. 111 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలోనూ. 115 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇటీవలే ముగిసిన బర్గర్‌ కింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ దాదాపు 157 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించిన సంగతి తెలిసిందే. 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్‌ కింగ్‌ రెస్టారెంట్స్‌ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. (బర్గర్‌కింగ్‌ పుష్‌- బెక్టర్స్‌ ఫుడ్‌ ఐపీవోకు రెడీ)

ఐదేళ్లలో.. 
గ్లోబల్‌ క్యూఎస్‌ఆర్‌ చైన్‌ సంస్థ బర్గర్‌ కింగ్‌ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్‌ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్‌ కింగ్‌ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్‌ బ్రాండ్లలో నెట్‌వర్క్‌ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌.. డోమినోస్‌ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌..  మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు