బర్గర్‌కింగ్‌- 3 రోజుల్లో 3 రెట్లు లాభం

16 Dec, 2020 13:22 IST|Sakshi

ముంబై, సాక్షి: అటు నిపుణులు, ఇటు ఇన్వెస్టర్లను నివ్వెరపరుస్తూ కేవలం మూడు రోజుల్లోనే అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్‌(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌కింగ్‌ షేరు మూడు రెట్లు రిటర్నులు అందించింది. ఇటీవల రూ. 60 ధరలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన బర్గర్‌ కింగ్‌ తొలి రోజు సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. బీఎస్‌ఈలో ఏకంగా 91 శాతం ప్రీమియంతో రూ. 115 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. తదుపరి రెండు రోజులుగా 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. తాజాగా బీఎస్‌ఈలో ఈ షేరు రూ. 33 ఎగసి రూ. 199 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఇష్యూ ధరతో పోలిస్తే 232 శాతం లేదా 3.3 రెట్లు అధికంగా లాభపడింది! ఇందుకు ఈ కౌంటర్లో కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడం ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. (బర్గర్‌ కింగ్‌ లిస్టింగ్.. అ‘ధర’హో)

మూడేళ్లుగా ఈ ట్రెండ్‌
రూ. 1,000 కోట్లలోపు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన బలమైన కంపెనీలు మూడేళ్లుగా తొలి వారంలో భారీగా లాభపడుతూ వస్తున్నట్లు టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌కు చెందిన కల్రా పేర్కొన్నారు. ఫ్లోటింగ్ స్టాక్‌ తక్కువగా ఉంటే ఈ మేనియా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ట్రేడర్లు, లేదా ఇన్వెస్టర్లకు కంపెనీ వేల్యుయేషన్స్‌ గుర్తుకురావని వ్యాఖ్యానించారు. డోమినోస్‌ పిజ్జా రెస్టారెంట్ల కంపెనీ జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ షేరు సైతం ఇదేవిధంగా లిస్టింగ్‌లో పటిష్ట లాభాలు ఆర్జించినట్లు ప్రస్తావించారు. (నేటి నుంచి బెక్టర్స్‌ ఫుడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ)

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌
2014 నవంబర్‌లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన బర్గర్‌కింగ్‌ తాజాగా 261 రెస్టారెంట్లకు విస్తరించింది. వీటిలో 8 సబ్‌ఫ్రాంచైజీలున్నాయి. 17 రాష్ట్రాలు, 57 పట్టణాలలో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. రానున్న కాలంలో వ్యాపార విస్తరణ ద్వారా కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు ఏంజెల్‌ బ్రోకింగ్‌కు చెందిన కేశవ్‌ లహోటీ పేర్కొన్నారు. అయితే క్యూఎస్‌ఆర్‌ విభాగంలో జూబిలెంట్‌ ఫుడ్‌ వాటా 21 శాతంకాగా..  మెక్‌డొనాల్డ్స్‌ సంస్థ వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్ 11 శాతం, కేఎఫ్‌సీ 10 శాతం, సబ్‌వే 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆలస్యంగా అడుగుపెట్టిన బర్గర్‌కింగ్‌ 5 శాతం వాటాతో వేగంగా విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. గత ఐదేళ్లలో బర్గర్‌కింగ్‌ అ‍మ్మకాలు 56 శాతం జంప్‌చేయగా.. వెస్ట్‌లైఫ్‌ 17 శాతం, జూబిలెంట్‌ 12 శాతం చొప్పున వృద్ధి చూపాయి. బర్గర్‌కింగ్‌ 2020 మార్చికల్లా రూ. 835 కోట్ల ఆదాయం సాధించింది. 

మరిన్ని వార్తలు