బస్సెక్కాలంటే భయం.. దోచేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు

9 Oct, 2021 16:54 IST|Sakshi

దసరా పండగ వచ్చిందంటే పిండి వంటలు, కొత్త బట్టలు ఇలా బడ్జెట్‌ లెక్కలు వేసుకుంటారు సామాన్యులు, కానీ ఇప్పుడా లెక్కలు తారుమారు అవుతున్నాయి. కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లాలంటే భారీ బడ్జెట్‌ కేటాయించాల్సిందే. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారీతిగా టిక్కెట్ల ధరలు పెంచడంతో ఈ పరిస్థితి నెలకొంది. 

బస్సుల్లోనే
దసరా పండుగ వేళ ఇళ్లకు వెళ్లే వారి జేబులు గుల్ల అవుతున్నాయి. ఇటు ఆర్టీసీ అటు ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలు పెంచేయడంతో సొంతిరికి ప్రయాణం భారంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆం‍ధ్ర ప్రదేశ్‌ ఆర్టీసీలు స్పెషల్‌ బస్సుల పేరుతో యాభై శాతం ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ బస్సుల్లో రెగ్యులర్‌ ఛార్జీలే ఉన్నా స్పెషల్‌ బస్సుల్లో మాత్రం అధికం తప్పడం లేదు. మరోవైపు పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపించే రైల్వేశాఖ కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గతేడాది నుంచి ప్రత్యేక రైళ్లు ఎక్కువగా నడిపించడం లేదు. దీంతో ఎక్కువ మంది బస్సుల్లోనే సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. 

నాలుగు వేల బస్సులు
ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ఎడా పెడా టిక్కెట్ల ధరలు పెంచేశారు. దీంతో సామాన్యుల పండగ బడ్జెట్‌లో లెక్కలు తారుమారు అవుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి నిత్యం నాలుగు వేలకు పైగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇందులో సగానికి పైగా బస్సులు ఏపీకే వెళ్తుంటాయి. మిగిలిన బస్సులు బెంగళూరు, ముంబై , ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాయి. దసరా పండగ సందర్భంగా పది రోజులకు పైగా సెలవులు రావడంతో ఏపీకి చెందిన వారు కుటుంబ సమేతంగా తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇలా వెళ్తున్న వారికి ప్రైవేటు ఆపరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో ఫిల్‌
ఆర్టీసీతో పోటీ పడుతూ ప్రైవేటు ఆపరేటర్లు సైతం అధికారికంగా పండగ బస్సులకు 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచారు. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులను సైతం స్పెషల్‌ కోటాకి మార్చేశారు. అంతటితో ఆగలేదు.. ఆన్‌లైన్‌లో నామ్‌ కే వాస్తేగా కొన్ని సీట్లు  మాత్రమే అమ్ముతూ.. బస్‌ ఫుల్‌ అయ్యిందంటూ కలరింగ్‌ ఇస్తున్నారు. దీంతో ఎలాగైనా సొంతూరికి వెళ్లాలి అనుకునే వారు ఆయా ప్రైవేట్‌ ఆపరేటర్స్‌ ఆఫీసులకు టిక్కెట్ల కోసం వెళ్తున్నారు. 
ఆఫ్‌లైన్‌లో బాదుడు
ప్రైవేటు ఆపరేటర్లు దాదాపు ప్రతీ బస్సులు పది నుంచి పదిహేను సీట్ల వరకు బ్లాక్‌ చేసి ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో వెళ్లి టిక్కెట్‌ బుక్‌ చేసుకోవాలంటే 50 శాతం అదనపు ఛార్జీలతో పాటు ఎక్స్‌ట్రా అమౌంట్‌ కూడా చెల్లించాల్సి వస్తుంది. అప్పుడే సీటు గ్యారెంటీ లేదంటే లేనట్టే. విజయవాడకి వెళ్లేందుకు టిక్కెట్‌ ఛార్జీకి అదనంగా రూ. 800 చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

చదవండి : దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు

మరిన్ని వార్తలు