ఎగబడి కొంటున్న జనం! ఈ ఇళ్లకు యమ డిమాండ్

1 Oct, 2022 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. భౌతిక దూరం నేపథ్యంలో ఇంటి విస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో రెండు పడక గదుల వైపు ఆసక్తి చూపిన కొనుగోలుదారులు శరవేగంగా మూడు పడక గదుల వైపు మళ్లుతున్నారు. 

గతేడాది జనవరి–జూన్‌ (హెచ్‌ 1)లో 46 శాతం మంది 2 బీహెచ్‌కే కొనుగోళ్లకు ఇష్టపడగా.. ఈ ఏడాది హెచ్‌1 నాటికి 38 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో 40 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే కాస్త 2022 హెచ్‌1 నాటికి 44 శాతానికి పెరిగిందని సీఐఐ – అనరాక్‌ కన్జ్యూమర్‌ సెంటిమెంట్‌ సర్వే వెల్లడించింది. 

జనవరి–జూన్‌ మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 5,500 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుందని, 16 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో స్వల్పంగా మెరుగుపడుతుందని అంచనా వేశారు.  

► నాలుగు పడక గదులకూ డిమాండ్‌ పెరిగింది. గతేడాది హెచ్‌1లో 2 శాతంగా ఉన్న ఈ గృహాల ఆసక్తి.. ఇప్పుడు 7 శాతానికి వృద్ధి చెందింది. రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ప్రాపర్టీల లావాదేవీలు 4 శాతం మేర వృద్ధి చెందాయి. కరోనా కంటే ముందు 6 శాతంగా ఉన్న ఈ ప్రాపర్టీల డిమాండ్‌.. 2022 హెచ్‌1 నాటికి 10 శాతానికి పెరిగింది. ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు కూడా ఈ గృహాల సరఫరాను పెంచారని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2022 హెచ్‌1లో రూ.33,210 లగ్జరీ యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయని పేర్కొన్నారు.  

గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంటేనే.. 
కరోనా తర్వాతి నుంచి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. రెడీగా ఉన్న, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు మధ్య అంతరం క్రమంగా తగ్గుతుంది. 2020 హెచ్‌1లో రెడీ టు మూవ్, కొత్త ప్రాజెక్ట్‌ మధ్య 46:18 శాతంగా ఉన్న నిష్పత్తి.. ఈ ఏడాది హెచ్‌1 నాటికి 30:25 శాతానికి చేరింది. 69 శాతం మంది సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. 31 శాతం మంది పెట్టుబడుల రీత్యా కొంటున్నారు.

8–10 ఏళ్ల పెట్టుబడి జోన్‌లో ఉన్న పెట్టుబడిదారులు సానుకూల దృక్పథంతో ఉన్నారని, వచ్చే ఏడాది కాలంలో నివాస సముదాయాల పెట్టుబడిదారుల మార్కెట్‌ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది హెచ్‌1లో 54 శాతం మంది ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్‌ ఎస్టేట్‌ ఉత్తమమైనదని భావించగా.. 2022 హెచ్‌1 నాటికిది 59 శాతానికి పెరిగింది.

 చదవండి👉 ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’.. బంపరాఫర్‌ ఇచ్చిన ప్రభుత్వం!

>
మరిన్ని వార్తలు