బ్రాండెడ్‌ గృహాలదే బాజా

5 Jun, 2021 02:21 IST|Sakshi

మొత్తం విక్రయాలలో 22 శాతం లిస్టెడ్‌ కంపెనీలదే

క్యూ2తో పోల్చితే క్యూ3లో 77 శాతం వృద్ధి

అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్స్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గృహ కొనుగోళ్లలో బ్రాండ్‌ మోగిపోతుంది. నాణ్యత, గడువులోగా నిర్మాణాల పూర్తి, ఆధునిక వసతుల కల్పన, రుణాల మంజూరులో ప్రాధాన్యత.. కారణాలేవైనా బ్రాండెడ్‌ నిర్మాణ సంస్థల గృహాలకు డిమాండ్‌ పెరిగింది. రెరా, జీఎస్‌టీ వంటి నిర్మాణాత్మక విధానాల అమలు తర్వాత వీటి ఆధిపత్యం పెరిగింది. లగ్జరీతో పాటు అఫర్డబుల్, మధ్య ఆదాయ విభాగాల గృహాలను నిర్మిస్తుండటంతో లిస్టెడ్, ప్రముఖ డెవలపర్ల విక్రయాలు ప్రతికూల సమయంలోనూ జోరుగా సాగుతున్నాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్స్‌ తెలిపింది.

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2021 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో (ఏప్రిల్‌–డిసెంబర్‌) 93,140 గృహాలు విక్రయమయ్యాయి. ఇందులో ఎనిమిది లిస్టెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల వాటా 22 శాతంగా ఉండగా.. ప్రధానమైన అన్‌–లిస్టెడ్‌ కంపెనీల విక్రయాలు 18 శాతం, ఇతర కంపెనీల విక్రయాలు 60 శాతంగా ఉన్నాయి. 2017 ఎఫ్‌వైలో మొత్తం 2.03 లక్షల గృహాలు విక్రయం కాగా ఇందులో టాప్‌ 8 లిస్టెడ్‌ కంపెనీల విక్రయాల వాటా 6 శాతంగా ఉంది. నాన్‌–లిస్టెడ్‌ సంస్థల విక్రయాలు 11 శాతం, ఇతరు ల వాటా 83 శాతంగా ఉంది. 2021 ఎఫ్‌వైలోని లిస్టెడ్‌ కంపెనీల సేల్స్‌లో అత్యధికంగా 66.4 లక్షల చ.అ. విక్రయాలతో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ముందు వ రుసలో నిలువగా.. 50.4 లక్షల చ.అ. విక్రయాలలో బెంగళూరు కంపెనీ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ నిలిచింది.

క్యూ3లో సేల్స్‌ అధరహో..
2021 ఎఫ్‌వై ఏప్రిల్‌–డిసెంబర్‌లో 8 లిస్టెడ్‌ కంపెనీలు 2.123 కోట్ల చ.అ.లో విక్రయాలను పూర్తి చేశాయి. కోవిడ్‌–19 ఫస్ట్‌ వేవ్‌ 2020 ఎఫ్‌వైతో పోల్చితే విక్రయాలలో 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 ఎఫ్‌వై ఏప్రిల్‌–డిసెంబర్‌లో 2.088 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. ఎఫ్‌వై 21లో తొలి మూడు త్రైమాసికాల విక్రయాలను గమనిస్తే.. అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో సేల్స్‌ బాగా జరిగాయి. జూలై–సెప్టెంబర్‌ (క్యూ2)తో పోలిస్తే క్యూ3 విక్రయాలలో 77 శాతం వృద్ధి నమోదయింది. 8 లిస్టెడ్‌ కంపెనీలు ఏప్రిల్‌–జూన్‌ (క్యూ1)లో 51.6 లక్షల చ.అ. విక్రయాలను పూర్తి చేయగా.. క్యూ2లో 58 లక్షల చ.అ., క్యూ3లో 1.027 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. జనవరి–మార్చి (క్యూ4)లో ఇప్పటివరకు బ్రిగేడ్, ఒబెరాయ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్‌ మూడు కంపెనీలు మాత్రమే ఫలితాలను ప్రకటించాయి. ఇవి 32.1 లక్షల చ.అ.లుగా ఉన్నాయి.

లిస్టెడ్, ప్రధాన కంపెనీలివే...
► 8 లిస్టెడ్‌ కంపెనీలివే: బ్రిగేడ్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, కోల్టే–పాటిల్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఒబెరాయ్‌ రియాల్టీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్, పూర్వాంకర, శోభా.
► ప్రధాన కంపెనీలివే:  మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్, అసెట్జ్‌ ప్రాపర్టీ, ఏటీఎస్‌ గ్రీన్, కాసాగ్రాండ్‌ బిల్డర్స్, కల్పతరు, లోధా గ్రూప్, పిరామల్‌ రియల్టీ, రన్వాల్‌ గ్రూప్, సలార్పూరియా సత్త్వా, శ్రీరామ్‌ ప్రాపర్టీస్, సిగ్నేచర్‌ గ్లోబల్, సన్‌టెక్‌ రియల్టీ, టాటా హౌసింగ్‌ డెవలపర్‌మెంట్‌ కో, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, వాధ్వా గ్రూప్, వీటీపీ రియల్టీ.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు