ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!

6 Apr, 2023 11:35 IST|Sakshi

ప్రస్తుతం భూమి.. బంగారం కంటే విలువైనదిగా మారిపోయింది. దీంతో భూమిపై పెట్టుబడి పెట్టేవారు ఇటీవల కాలంలో బాగా పెరిగారు. అధికంగా పెట్టుబ‌డులు పెట్టే స్థోమ‌త ఉన్న‌వారు షేర్స్, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం క‌న్నా కూడా స్థిరాస్తి మీదే ఎక్కువ‌ ఆస‌క్తి చూపుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో డీలా పడిన రియల్‌ ఎస్టేట్‌ రంగం తర్వాత పుంజుకుంది.

(త్వరలోనే యాపిల్‌ స్టోర్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌.. భారత్‌ రానున్న టిమ్‌కుక్‌!)

కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కూడా ప్రస్తుతం తక్కువ వడ్డీకి హోంలోన్లు ఇస్తున్నాయి. దీంతో ఇల్లు లేదా స్థ‌లం కొన‌డానికి ఇదే అనువైన స‌మ‌యమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసేవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఎలాంటివి కొనాలి.. ఎక్కడ కొనాలి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

(జీతం నుంచి టీడీఎస్‌ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు)

అనుమతులన్నీ ఉన్నాయా?
స్థిరాస్తి కొనుగోలు అన్న‌ది అధిక పెట్టుబ‌డుల‌తో కూడుకున్న‌ది. కాబట్టి జాగ్ర‌త్త‌లు కూడా ఎక్కువే తీసుకోవాలి.  ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకుంటున్న చోటు అంటే ఆ నగరం లేదా పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గురించి ప‌రిశోధ‌న చేయాలి. ర‌హ‌దారులు, హైవేలు, క‌నెక్టివిటీ వంటివి తెలుసుకోవాలి.  ఏవైనా వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసేవారు వాటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే ఇల్లు కట్టుకునేటప్పుడు చిక్కులు తప్పవు. 

ఇక ఇదివరకే నిర్మించిన ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లయితే యాజ‌మాన్య ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, బిల్డింగ్ లే అవుట్ ఆమోదం, ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్‌, వ్య‌వ‌సాయేత‌ర అనుమ‌తి, నీరు, అగ్నిమాప‌క విభాగం ఆమోదం వంటివి ఉన్నాయో లేదో త‌నిఖీ చేసుకోవాలి. నివాసం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించ‌డానికి రెరా (రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీ) రిజిస్ట్రేష‌న్ కూడా పరిశీలించాలి.

అలాగే కొత్తగా ఏమైనా నిబంధనలు వచ్చాయేమో తెలుసుకోవాలి. ఆస్తి కొంటున్న ప్రాంతం ఏ అధీకృత సంస్థ పరిధిలోకి వస్తుందో దాని ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆయా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అసలైనవేనా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఎలాంటివి కొనాలి?
సాధారణంగా ఇల్లు లేదా స్థలాలను కొనేవారిలో చాలా మంది సొంత వినియోగం కోస‌మే తీసుకుంటున్నారు. మరికొంత మంది కేవలం పెట్టుబ‌డి కోణంలోనే ఆస్తులు కొంటున్నారు. అయితే సొంత వినియోగం కోసం ఆస్తులు కొనేవారు నాణ్యమైనవి కొనుగోలు చేయాలి. ఇందు కోసం మార్కెట్లో నమ్మకమైన బ్రాండెడ్ డెవ‌ల‌ప‌ర్‌ల ద‌గ్గ‌ర కొనుగోలు చేస్తే మంచిది. గుర్తింపు లేని, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతపై జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కడ కొనాలి?
ప్ర‌ధాన ర‌హ‌దారులు, మెట్రో స్టేష‌న్‌లు, బ‌స్సులు, ఆటోలు వంటి ప్ర‌జా ర‌వాణాకు అందుబాటులో ఉన్న ప్ర‌దేశాల‌లో ఆస్తుల‌ను కొనుగోలు చేస్తే భ‌విష్య‌త్తులో మంచిది. అంతేకాకుండా స్థిరాస్తికి స‌మీపంలో పాఠ‌శాల‌లు, వాణిజ్య భవన సముదాయాలు, ఆసుప‌త్రులు ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సౌక‌ర్యాల‌న్ని ప్రాథ‌మిక అవ‌స‌రాలు తీర్చ‌డమే కాకుండా ఆస్తి విలువ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బిల్డర్‌ గురించి తెలుసుకున్నారా?
ఏదైనా ప్రాజెక్ట్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందు, బిల్డ‌ర్ గ‌త రికార్డు, అత‌ను ఎన్ని ప్రాజెక్ట్‌ల‌ను పూర్తి చేశాడు, నిర్మాణం పూర్తి చేసే స‌మ‌యం, నిర్మాణ నాణ్య‌త‌ను ప‌రిశీలించాలి. కొనుగోలుదారులు అజాగ్ర‌త్త‌గా ఉంటే మోసపోయే అవకాశం లేకపోలేదు. కాబ‌ట్టి స్థిరాస్తి కొనుగోలు చేసేవారు ముందుగా తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం  చాలా అవ‌స‌రం.

మరిన్ని వార్తలు