దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?

1 Nov, 2021 18:07 IST|Sakshi

దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మార్కెట్ పై సాధించేందుకు దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు కూడా పోటీపడుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బీవైడీ తన ఎలక్ట్రిక్ కారు బీవైడీ ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి వాహనాన్ని రూ.29.15 లక్షల ప్రారంభ ధరతో దేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, కొచ్చి, చెన్నైలోని తన షోరూమ్ లలో కారును బీవైడీ ఇండియా అమ్మకానికి తీసుకొనివచ్చింది.

520 కిలోమీటర్ల రేంజ్
బీవైడీ ఈ6 ఆల్ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఎల్ఈడీ ల్యాంపులతో వస్తుంది. దీనిలో డ్రైవరుతో పాటు ఆరుగురు కూర్చోవచ్చు. 10.1 అంగుళాల రొటేటబుల్ టచ్ స్క్రీన్, బ్లూటూత్, డబ్ల్యుఐ-ఎఫ్ఐ కనెక్టివిటీ ఉంది. గాలి శుద్ధికరణ కోసం ఇందులో సీఎన్95 ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 71.7 కెడబ్ల్యుహెచ్ లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది డబ్ల్యుఎల్ టీసీ ప్రకారం 520 కిలోమీటర్లు, ఎఆర్ఎఐ ప్రకారం 415 కిలోమీటర్ల వరకు ఒకసారి చార్జ్ చేస్తే వెళ్లగలదు. ఇది 180ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ఠ వేగం 130 కిలోమీటర్లు. ఈ బ్యాటరీ ప్యాక్ భద్రత పరంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని బీవైడీ ఇండియా తెలిపింది.

బైడ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. బైడ్ ఈ6 ఎలక్ట్రిక్ కారు ఎమ్‌పివి ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ మద్దతు ఇస్తుంది. డిసి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా 35 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. దీనిలో 580-లీటర్ పెద్ద బూట్ స్పేస్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఐపీబీ ఇంటెలిజెంట్ బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. బీవైడీ ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి వారెంటీ 3 సంవత్సరాలు/1,25,000 కి.మీ(ఏది ముందు అయితే అది), బ్యాటరీ సెల్ వారెంటీ 8 సంవత్సరాలు/5,00,000 కి.మీ (ఏది ముందు అయితే అది), 8 సంవత్సరాలు /1,50,000 కి.మీ ట్రాక్షన్ మోటార్ వారెంటీతో వస్తుంది.

(చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు స్పీడ్ తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే!)

మరిన్ని వార్తలు