విద్యార్ధుల కోసం 200 న‌గ‌రాల్లో 500 ట్యూష‌న్ సెంట‌ర్లు..రూ.1,500 కోట్లతో బైజూస్‌!

18 Feb, 2022 12:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ దేశవ్యాప్తంగా బోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 12–18 నెలల్లో 200 నగరాల్లో 500 సెంటర్లను స్థాపించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బైజూస్‌ సీవోవో మృణాల్‌ మోహిత్‌ వెల్లడించారు. ఇప్పటికే సంస్థ 80 కేంద్రాలను పైలట్‌ ప్రాజెక్టు కింద నెలకొల్పింది. వీటి ద్వారా 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తోంది. ట్యూషన్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఏడాదిలో 10,000 పైచిలుకు మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యం.  

గూగుల్‌తో చేతులు క‌లిపింది
ఇప్ప‌టికే బైజూస్ దేశీయంగా పాఠశాలల్లో ఆన్‌లైన్‌ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే.  ఈ డీల్‌లో భాగంగా గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఫర్‌ ఎడ్యుకేషన్, బైజూస్‌కి చెందిన విద్యార్థి పోర్టల్‌ను అనుసంధానించారు ఇందుకు సంబంధించిన ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న విద్యాసంస్థలు.. బైజూస్‌కి చెందిన మ్యాథ్స్, సైన్స్‌ బోధనా విధానాలతో తమ విద్యార్థులకు రిమోట్‌గా బోధిస్తున్నారు.  

దీనితో పాటు ఉపాధ్యాయులకు గూగుల్‌ క్లాస్‌రూమ్‌ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా విద్యాభ్యాసం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకుంటున్నారని బైజూస్‌ సీవోవో మృణాల్‌ మోహిత్‌ తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు