నీరజ్‌ చోప్రాకు ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్‌ భారీ నజరానా

8 Aug, 2021 14:41 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం సాధించిన భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ నేడు ₹2 కోట్ల నగదు రివార్డును ప్రకటించింది. ఒలింపిక్స్‌ గేమ్స్ లో దేశానికి కీర్తిని తెచ్చిన ఇతర ఆరుగురు పతక విజేతలకు ప్రతి ఒక్కరికి ఒక కోటి రూపాయలను ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రకటించింది. "క్రీడా విభాగాల్లో ఆటగాళ్లను ప్రోత్సహించడానికి మరింత ముందడుగు వేస్తూ.. నీరజ్ చోప్రాకు ₹2 కోట్లు, మీరాబాయి చాను, రవి కుమార్ దహియా, లోవ్లీనా బోర్గోనైన్, పివి సింధు, బజరంగ్ పునియాలకు 1 కోటి రూపాయలను" ప్రకటించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

"దేశ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. మేము మా ఒలింపిక్ హీరోలతో కలిసి జరుపుకునే వేడుక సమయం ఇది, 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాదు ప్రతి రోజూ" అని వ్యవస్థాపకుడు మరియు సీఈఓ బైజు రవీంద్రన్ తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో భాగంగా పురుషుల జావెలిన్‌ త్రోలో భారత ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచారు.

మరిన్ని వార్తలు