టిక్‌టాక్‌ రేసు నుంచి మైక్రోసాఫ్ట్‌ అవుట్‌

15 Sep, 2020 04:40 IST|Sakshi

ఒరాకిల్‌తో బైట్‌డ్యాన్స్‌ జట్టు

న్యూయార్క్‌: వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్‌కి విక్రయించరాదని చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ నిర్ణయించుకుంది. అమెరికాలో తమ కార్యకలాపాల కోసం మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ను టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్‌ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది.

‘టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించబోమని బైట్‌డ్యాన్స్‌ తెలియజేసింది‘ అని పేర్కొంది. అయితే, ఇటు దేశ భద్రతను కాపాడుతూనే అటు టిక్‌టాక్‌ యూజర్లకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా తాము కొనుగోలు ప్రతిపాదనను రూపొందించినట్లు వివరించింది. మరోవైపు, ఒరాకిల్‌ కేవలం టెక్నాలజీ భాగస్వామిగానే  లేక టిక్‌టాక్‌లో మెజారిటీ వాటాలు కూడా కొనుగోలు చేస్తుందా అన్న విషయంపై స్పష్టత లేదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇది విక్రయ డీల్‌గా ఉండకపోవచ్చని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనంలో పేర్కొంది.  

యూజర్ల డేటా భద్రతపై ఆందోళన నేపథ్యంలో టిక్‌టాక్‌ను సెప్టెంబర్‌ 20లోగా ఏదైనా అమెరికన్‌ కంపెనీకి అమ్మేసి వైదొలగాలని, లేకపోతే నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం తెలిసిందే. దీంతో రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగింది. అయితే, టెక్నాలజీ బదలాయింపు   సమస్యగా మారింది. మరోవైపు, ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా ఆ కంపెనీకే టిక్‌టాక్‌ను అప్పగించే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా