సాదాసీదా క్యాబ్‌ డ్రైవరే కావొచ్చు.. ఓలా, ఉబెర్‌లకు గట్టిపోటీ ఇస్తున్నాడు!

22 Dec, 2023 15:54 IST|Sakshi

ఓ సాదాసీదా క్యాబ్‌ డ్రైవర్‌ దేశీయ దిగ్గజ రైడ్‌ షేరింగ్‌ సంస్థలు ఓలా, ఉబెర్‌ గుత్తాదిపత్యానికి చెక్‌ పెడుతున్నాడు. చాపకింద నీరులా రైడ్‌ షేరింగ్‌ మార్కెట్‌ని శాసించే దిశగా వడిఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఇంతకీ ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఎవరు? ఓలా, ఉబెర్‌ మార్కెట్‌ను తనవైపుకి ఎలా తిప్పుకుంటున్నాడు?  

చేతిలో వెహికల్‌ లేదు. అత్యవసరంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలి. ఆ సమయంలో మనం ఏం చేస్తాం. ఫోన్‌ తీసి వెంటే ఓలా, ఉబెర్‌తో పాటు ఇతర రైడ్‌ షేరింగ్‌ యాప్స్‌ ఓపెన్‌ చేసి అవసరానికి తగ్గట్లు బైక్‌, ఆటో, కారు ఇలా ఏదో ఒకటి బుక్‌ చేసుకుంటాం. సెకన్లు, నిమిషాల వ్యవధిలో సదరు క్యాబ్‌ డ్రైవర్‌ వచ్చి మనల్ని కోరుకున్న గమ్యానికి సురక్షితంగా వెళుతుంటారు. అలాంటి ఓ క్యాబ్‌ డ్రైవర్‌ సొంతంగా రైడ్‌ షేరింగ్‌ సంస్థను స్థాపించాడు. మార్కెట్‌లో కింగ్‌ మేకర్‌గా ఓలా, ఉబెర్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. 

600 మందికి పైగా డ్రైవర్లతో 
బెంగళూరు కేంద్రంగా ఒకప్పటి ఓలా, ఉబెర్‌లలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేసిన లోకేష్‌ ‘నానో ట్రావెల్స్‌’ పేరుతో సొంతంగా స్టార్టప్‌ను ప్రారంభిచాడు. ఇప్పటికే ఆ సంస‍్థతో సుమారు 600పైగా డ్రైవర్లు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. 

డ్రైవర్‌ని కాదు.. ఓ కంపెనీకి బాస్‌ని 
ఈ తరుణంలో లోకేష్‌ నడుపుతున్న క్యాబ్‌ను బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్‌ ప్రయాణించాడు. ప్రయాణించే సమయంలో కస్టమర్‌, నానో ట్రావెల్స్‌ ఓనర్‌ లోకేష్‌లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తాను క్యాబ్‌ డ్రైవర్‌ని కాదని, ఓలా,ఉబెర్‌ల తరహాలో నానో ట్రావెల్స్‌ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెప్పాడు. అంతేకాదు నేటినుంచి యాపిల్‌ ఐఓఎస్‌ యూజర్లకు తమ సంస్థ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఆ యాప్స్‌ను సొంతంగా డెవలప్‌ చేసింది తానేనని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సదరు కష్టమర్‌ వంతైంది. 

అవసరం అయితే ఫోన్‌ చేయండి
ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇతర అత్యవసర సమయాల్లో క్యాబ్‌ కావాల్సి ఉంటే ఫోన్‌ చేయమని కోరుతూ ఇరువురి ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకున్నారు. లోకేష్‌ జరిపిన సంభాషణను కస్టమర్‌ ఎక్స్‌. కామ్‌లో ట్వీట్‌ చేయడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

డ్రైవర్‌ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా 
ఆ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక డ్రైవర్‌ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఎదుగుతున్నందుకు శుభాకాంక్షలు చెబుతుంటే రైడ్‌ షేరింగ్‌ మార్కెట్‌లో గట్టి పోటీ నెలకొంది. నిలబడడం కష్టమేనని అంటున్నారు.  

కొత్త సంస్థలు పుట్టుకు రావడం మంచిదే
మరికొందరు ఉబెర్‌, ఓలా వంటి దిగ్గజ సంస్థ కొన్ని సార్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్ధవంతమైన ప్రయాణాల్ని అందించలేవు. రైడ్‌ ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ క్యాబ్‌ కోసం ఎదురు చూసే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నానో ట్రావెల్స్‌ ఉపయోగం ఎక్కువగా ఉంటుందంటూ రిప్లయి ఇస్తున్నారు.

చదవండి👉 రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్‌ అంబానీ!

>
మరిన్ని వార్తలు