డీటీహెచ్‌ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్‌

24 Dec, 2020 00:38 IST|Sakshi

నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: డీటీహెచ్‌ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్‌ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్‌ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.  

ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్‌
‘‘భారత్‌లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్‌ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్‌ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్‌ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్‌ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్‌ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్‌డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు.   

8 శాతానికి తగ్గింపు  
నూతన నిబంధనల కింద లైసెన్స్‌ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్‌టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్‌ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్‌ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్‌ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్‌పోర్ట్‌ స్ట్రీమ్‌లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్‌స్క్రైబర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎమ్‌ఎస్‌), కండీషనల్‌ యాక్సెస్‌ సిస్టమ్‌ (సీఏఎస్‌) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్‌వేర్‌ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్‌ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది.

సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి
‘‘మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్‌ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్‌ నాగ్‌పాల్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్‌ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్‌ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి.  కేబుల్‌ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్‌ పరిధిలోనే, ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్‌పాల్‌ చెప్పారు. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్‌ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు