లాంబ్రెటా కంపెనీ ఇక కనుమరుగు..

22 Jan, 2021 06:15 IST|Sakshi

స్కూటర్స్‌ ఇండియా మూసివేతకు కేంద్రం నిర్ణయం

ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఓకే

న్యూఢిల్లీ: లాంబ్రెటా.. విజయ్‌ సూపర్‌ .. కొన్ని దశాబ్దాల క్రితం స్కూటర్లకు పర్యాయపదంగా నిల్చాయీ బ్రాండ్లు. అప్పట్లో ఓ ఊపు ఊపిన లాంబ్రెటా స్కూటర్లంటే ఇప్పటికీ ఒక వింటేజ్‌ బ్రాండ్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమేణా లాంబ్రెటా, విజయ్‌ సూపర్‌ ఇతర వాహనాల పోటీ దెబ్బకు కనుమరుగయ్యాయి. ఇప్పుడిక వీటిని తయారు చేసిన కంపెనీ స్కూటర్స్‌ ఇండియా (ఎస్‌ఐఎల్‌) వంతు వచ్చింది. నష్టాల భారంతో కుదేలవుతున్న ఎస్‌ఐఎల్‌ను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దీన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. మూసివేతకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తదుపరి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రతిపాదన ప్రకారం స్కూటర్స్‌ ఇండియా బ్రాండ్‌ పేరును విడిగా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్‌ ముందు ఉంచిన ప్రణాళిక ప్రకారం కంపెనీ మూసివేతకు రూ. 65.12 కోట్లు అవసరమయ్యే నిధులను రుణం కింద కేంద్రం సమకూర్చాలి. తగు స్థాయిలో నిధులు సమకూరిన తర్వాత అదనంగా ఉన్న రెగ్యులర్‌ సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును (వీఆర్‌ఎస్‌/వీఎస్‌ఎస్‌) ఆఫర్‌ చేయనున్నారు. లక్నో కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్కూటర్స్‌ ఇండియాలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన 147.49 ఎకరాల స్థలాన్ని పరస్పర ఆమోదయోగ్య రేటు ప్రకారం ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధి ప్రాధికార సంస్థకు అప్పజెబుతారు. ఇక, స్టాక్‌ ఎ క్సే్చంజీల నుంచి షేర్లను కూడా డీలిస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

1972 నుంచి..
స్కూటర్స్‌ ఇండియా (ఎస్‌ఐఎల్‌) 1972లో ఏర్పాటైంది. వివిధ రకాల ఇంధనాలతో పనిచేసే త్రిచక్ర వాహనాల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ కోసం దీన్ని నెలకొల్పారు. 1975లో దేశీ మార్కెట్‌ కోసం విజయ్‌ సూపర్‌ బ్రాండ్‌తోనూ, విదేశీ మార్కెట్ల కోసం లాంబ్రెటా పేరుతోనూ ఎస్‌ఐఎల్‌ స్కూటర్లను తయారు చేయడం మొదలు పెట్టింది. అటు పైన విక్రమ్‌/లాంబ్రో పేరిట త్రిచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేసింది. 1997లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన ఎస్‌ఐఎల్‌ .. విక్రమ్‌ బ్రాండు కింద వివిధ త్రిచక్ర వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుండటంతో కేంద్రం గతంలో దీన్ని విక్రయించే ప్రయత్నాలు చేసింది. యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు తనకున్న పూర్తి వాటాలను విక్రయించేందుకు 2018 లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. కానీ, విక్రయ యత్నాలు కుదరకపోవడంతో చివరికి మూసివేత నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు