ల్యాప్‌టాప్, టాబ్లెట్, పీసీల వంతు

25 Feb, 2021 05:50 IST|Sakshi

‘పీఎల్‌ఐ’ కింద రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలు

ఫార్మా రంగానికీ పీఎల్‌ఐ పథకం

రూ.15,000 కోట్ల కేటాయింపులు

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్‌ ఇన్‌ వన్‌ పర్సనల్‌ కంప్యూటర్లు (పీసీ), సర్వర్ల తయారీతోపాటు, ఫార్మా రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) అమలు చేసే ప్రతిపాదనలకు ప్రధాని అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలియజేసింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు భారత్‌లో తయారీ దిశగా ఆకర్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. టెలికం ఎక్విప్‌మెంట్‌ల తయారీకి పీఎల్‌ఐ పథకాన్ని వర్తింపజేస్తూ, 12,195 కోట్ల మేర రాయితీలు కల్పించేందుకు కేంద్రం గతవారం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

ఐటీ హార్డ్‌వేర్‌ (ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్‌ ఇన్‌ వన్‌ పీసీలు, సర్వర్ల తయారీతో కూడిన) రంగానికి పీఎల్‌ఐ పథకం కింద రూ.7,350 కోట్ల రాయితీలు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలియజేసినట్టు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ మీడియాకు తెలిపారు. నాలుగు సంవత్సరాలపాటు భారత్‌లో ఈ ఉత్పత్తుల తయారీకి ఈ మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఈ పథకం భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడంతోపాటు, ఎగుమతుల వృద్ధికి, ఉపాధి అవకాశాల విస్తృతికి తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్ల తయారీకి పీఎల్‌ఐ పథకాన్ని గతేడాది కేంద్రం ప్రకటించడంతో శామ్‌సంగ్, యాపిల్‌ తదితర దిగ్గజ అంతర్జాతీయ, దేశీయ సంస్థలు రాయితీల కోసం దరఖాస్తులు చేసుకోవడం తెలిసిందే.  

ఇవే ప్రోత్సాహకాలు..
2019–20 బేస్‌ సంవత్సరంగా పరిగణిస్తూ ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల విక్రయాల(పెరిగిన మేర)పై 4–1 శాతం వరకు ప్రోత్సాహకాలను ఈ పథకం కింద కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వనుంది. పెట్టుబడులు పెట్టడంతోపాటు, ఉపాధి కల్పన, నిర్దేశిత విక్రయ లక్ష్యాలను చేరుకున్న కంపెనీలకే ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఐదు అంతర్జాతీయ సంస్థలు, 10 దేశీ చాంపియన్‌ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయని మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు. ఈ ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నామని పేర్కొంటూ, వీటి విషయంలో స్వావలంబన అవసరమన్నారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో అదనంగా రూ.2,700 కోట్ల పెట్టుబడులకు తాజా నిర్ణయం వీలు కల్పిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్, టాబ్లెట్ల డిమాండ్‌ ను పెద్ద మొత్తంలో దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నాము. రూ.29,470 కోట్ల మేర ల్యాప్‌టాప్‌లు, రూ.2,870 కోట్ల ట్యాబ్లెట్ల దిగుమతులు నమోదవుతున్నాయి. ‘‘గడిచిన 5 నెలల కాలం లో పీఎల్‌ఐ పథకం కింద రూ.35,000 కోట్ల ఉత్ప త్తుల తయారీ దేశీయంగా నమోదైంది. రూ.1,300 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 22,000 మందికి ఉపాధి లభించింది’’ అని కేంద్రం తెలిపింది.

ఫార్మాలోకి రూ.15,000 కోట్ల పెట్టుబడులు
ఫార్మాస్యూటికల్స్‌కు సైతం పీఎల్‌ఐ కింద రూ.15,000 కోట్ల రాయితీల కల్పనకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. దేశీయ తయారీ సంస్థలకు ఈ పథకం మేలు చేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతోపాటు ప్రజలకు మందులు అందుబాటు ధరలకు లభించేందుకు వీలు కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. పీఎల్‌ఐ పథకం వల్ల ఆరేళ్ల కాలంలో (2022–28 మధ్య) రూ.2.94 లక్షల కోట్ల మేర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, రూ.1.96 లక్షల కోట్ల ఫార్మా ఎగుమతులు నమోదవుతాయనేది ప్రభుత్వం అంచనా.  

ప్రోత్సాహకాలు..: అంతర్జాతీయ తయారీ ఆదాయాల (జీఎమ్‌ఆర్‌) ఆధారంగా ఫార్మా కంపెనీలను కేంద్రం మూడు కేటగిరీలుగా విభజించింది. గ్రూప్‌ ఎ కింద రూ.5,000 కోట్లు అంతకుమించి జీఎమ్‌ఆర్‌ కలిగిన కంపెనీలకు.. రూ.11,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. రూ.500–5,000 కోట్ల మధ్య జీఎమ్‌ఆర్‌ కలిగిన కంపెనీలకు గ్రూప్‌ బి రూ.2,250 కోట్లు, రూ.500 కోట్లలోపు జీఎమ్‌ఆర్‌ కలిగిన ఫార్మా కంపెనీలకు గ్రూప్‌ సి కింద రూ.1,750 కోట్ల మేర ప్రోత్సాహకాలను కేంద్రం నాలుగేళ్ల కాలంలో ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు