ఐడీబీఐ బ్యాంక్‌ అమ్మకానికి కేంద్ర కేబినెట్‌ ఓకే

6 May, 2021 00:10 IST|Sakshi

కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ అనుమతి 

ఎల్‌ఐసీ, ప్రభుత్వ వాటాల విక్రయానికి సై 

యాజమాన్య నియంత్రణ బదిలీ సైతం

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి(డిజిన్వెస్ట్‌మెంట్‌) కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ అనుమతిని తెలియజేసింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్‌ ముందస్తు అనుమతినిచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీలకు సంయుక్తంగా 94 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ విడిగా 49.21 శాతం వాటాను కలిగి ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన బడ్జెట్‌లో ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటైజ్‌ చేసేందుకు ప్రతి పాదించిన విషయం విదితమే.  

2019లో..: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ 2019 జనవరిలో ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా.. ప్రభుత్వంతోపాటు బ్యాంకులో వాటాను విక్రయించేందుకు ఎల్‌ఐసీ బోర్డు సైతం అనుమతించింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం వదులుకునేందుకు అంగీకరించింది. వీటితోపాటు నియంత్రణ సంబంధ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో వాటాను తగ్గించుకునేందుకు నిర్ణయించింది. బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న వ్యూహాత్మక కొనుగోలుదారుడు బిజినెస్‌ను పెంపొందించేందుకు వీలుగా  పెట్టుబడులతోపాటు.. కొత్త టెక్నాలజీ, ఉత్తమ నిర్వహణ తదితరాలకు తెరతీసే వీలుంది. తద్వారా ఐడీబీఐ బ్యాంక్‌ భవిష్యత్‌లో పెట్టుబడులు లేదా ఇతర సహాయాల కోసం  ప్రభుత్వం, ఎల్‌ఐసీలపై ఆధారపడవలసిన అవసరముండదని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా.. బ్యాంక్‌ ఐదేళ్ల తదుపరి గతేడాది(2020–21) నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇదే కాలంలో 2017 మేలో ఆర్‌బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం 2021 మార్చిలో బయటపడడం గమనార్హం! ఈ వార్తలతో ఐడీబీఐ బ్యాంకు షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5% జంప్‌చేసి రూ. 38 వద్ద ముగిసింది.   

చదవండి: (ఆర్థిక సంక్షోభంగా మారకూడదు!: నిర్మలా)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు