పట్టణాభివృద్ధిలో భారత్‌కు జపాన్‌ చేయూత

3 Jun, 2021 02:36 IST|Sakshi

ఎంఓసీపై సంతకాలకు క్యాబినెట్‌ ఓకే

న్యూఢిల్లీ: పట్టణాభివృద్ధిలో జపాన్‌ సహకారం పొందేందుకు భారత్‌ ముందడుగు వేసింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకునేందుకు బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధికార ప్రకటన ప్రకారం భారత్‌ తరఫున గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే జపాన్‌ తరఫున భూ, మౌలిక, రవాణా, పర్యాటక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఎంఓసీపై సంతకాలు చేయనున్నారు. నిజానికి పట్టణాభివృద్ధికి సంబంధించి రెండు దేశాలూ 2007లో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీని స్థానంలో తాజాగా ఎంఓసీ రానుంది.  

ఉపాధి కల్పనకూ అవకాశాలు
అర్బన్‌ ప్లానింగ్, స్మార్ట్‌ సిటీల అభివృద్ధి, చౌక ధరల గృహ నిర్మాణం, పట్టణ వరద నివారణా నిర్వహణ, పారిశుధ్యం, వేస్ట్‌ వాటర్‌ నిర్వహణ, పట్టణ రవాణా, విపత్తు నిర్వహణ వంటి కీలక అంశాలపై రెండు దేశాలూ మున్ముందు సహకరించుకోనున్నాయి. ఇందుకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టుల వల్ల యువతకు కూడా ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయి.  సహకారం విషయంలో వ్యూహం, కార్యక్రమాల అమలు వంటి కార్యకలాపాలకు సంయుక్త కార్యాచరణ బృందం (జేడబ్ల్యూజీ) కూడా ఏర్పాటవుతుంది. ఏడాదికి ఒకసారి  జేడబ్ల్యూజీ సమావేశమవుతుంది. ఈ సమావేశం ఒక ఏడాది భారత్‌లో జరిగితే మరో సంవత్సరం జపాన్‌లో జరుగుతుంది. ఒకసారి సంతకాలు పూర్తయిన తర్వాత ఐదేళ్లు ఎంఓసీ అమల్లో ఉంటుంది. కాగా, పట్టణాభివృద్ధికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవులతో జరిగిన ఎంఓయూపై కూడా క్యాబినెట్‌ సమీక్షించింది.

మరిన్ని వార్తలు