జనపనార రైతులకు కేంద్రం శుభవార్త..!

22 Mar, 2022 17:39 IST|Sakshi

జనపనార రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2022-23 సీజన్‌కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారసుల ఆధారంగా క్వింటాకు రూ.250 పెంచుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

2022-23 సీజన్‌లో ముడి జనపనార(టీడీఎన్3 గ్రేడ్కు సమానమైన టీడీఎన్3) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.4,750గా నిర్ణయించారు. దీని వల్ల కనీస మద్దతు ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్వింటాకు రూ.250 పెరగనుంది. 2018-19 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎమ్ఎస్‌పీని అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు స్థాయిలో నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా కొత్త ఎమ్ఎస్‌పీని ప్రకటించింది. "దీని వల్ల లాభ శాతం కనీసం 50 శాతం పెరుగుతుంది. జనపనార రైతులకు మెరుగైన లాభదాయకమైన రాబడిని అందించడానికి, నాణ్యమైన జనపనార ఫైబరును ప్రోత్సహించడానికి ఇది ముఖ్యమైన నిర్ణయం" అని ప్రభుత్వం తెలిపింది. 

(చదవండి: గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. భారీ జరిమానా కట్టాల్సిందే!)

మరిన్ని వార్తలు