Canara Bank Q1 Results: వావ్‌.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్‌!

26 Jul, 2022 07:15 IST|Sakshi

ముంబై: మెరుగైన రుణ వృద్ధి, వడ్డీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ నికర లాభం 72 శాతం ఎగిసి రూ. 2,022 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,177 కోట్లు. ‘నికర వడ్డీ ఆదాయంతో (ఎన్‌ఐఐ) పాటు వడ్డీయేతర ఆదాయం కూడా 25 శాతం పెరిగింది. కేటాయింపులు అదుపులోనే ఉన్నాయి. రుణ వృద్ధి కూడా సానుకూలంగా నమోదైంది‘ అని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఎల్‌వీ ప్రభాకర్‌ తెలిపారు.

సమీక్షాకాలంలో ఎన్‌ఐఐ 10.15 శాతం పెరిగి రూ. 6,160 కోట్ల నుంచి రూ. 6,785 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 24.55 శాతం వృద్ధితో రూ. 4,155 కోట్ల నుంచి రూ. 5,175 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.71 శాతం నుంచి 2.78 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.90 శాతం స్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రభాకర్‌ తెలిపారు. సమీక్షాకాలంలో స్థూల రుణాల వృద్ధి 13.14 శాతంగాను, డిపాజిట్ల వృద్ధి 8.49 శాతంగాను నమోదైంది.  

తగ్గిన మొండిబాకీలు 
మరోవైపు, స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 8.50 శాతం నుంచి 6.98 శాతానికి దిగి రాగా, నికర ఎన్‌పీఏల నిష్పత్తి కూడా 3.46 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ. 1,886 కోట్ల మొత్తం రికవర్‌ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్ల రికవరీలను లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభాకర్‌ చెప్పారు. అలాగే నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి బదిలీ చేసేందుకు రూ. 2,300 కోట్ల విలువ చేసే మొండి పద్దులను గుర్తించినట్లు వివరించారు. 

చదవండి: Huawei: భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం

మరిన్ని వార్తలు