ఈ స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు

26 Dec, 2022 10:40 IST|Sakshi

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్! భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్న లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకం ఇది. మోస్తరు రిస్క్‌ ఉంటుంది. మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది.  

పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్‌ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. బోటమ్‌అప్‌ విధానాన్ని పెట్టుబడుల విషయంలో అనుసరిస్తోంది. కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది.
  
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉండడం, ఇన్వెస్టర్లకు ఈ పథకం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. సిప్‌ విధానంలో ప్రతి నెలా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో ప్రస్తుతం ఈక్విటీలకు 97 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 56 స్టాక్స్‌ ఉన్నాయి. లార్జ్‌కాప్స్‌ కంపెనీల్లో 72 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంటే, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 35 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో కేవలం 1.92 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 30 శాతం పెట్టుబడులు ఈ రంగంలోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత ఆటోమొబైల్‌ కంపెనీల్లో 9.24 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.72 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 7.25%, టెక్నాలజీ కంపెనీల్లో 6.99 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది.  

రాబడులు 
ఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చింది. గత ఏడాదిగా మార్కెట్లలో అనిశ్చితులు నెలకొని ఉండడం, మిడ్‌క్యాప్‌ కంపెనీలు ఎక్కువగా నష్టపోవడం రాబడులపై ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 18 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో 10.16 శాతం, ఏడేళ్లలో 14.24 శాతం, పదేళ్లలో 19.38 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇందులో ఉన్నాయి. ఏడాది, ఐదేళ్ల కాలంలో మినహా లార్జ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ రాబడుల కంటే ఇందులోనే ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు