వృద్ధికి కేంద్రం పెట్టుబడులు కొనసాగుతాయ్‌

18 Jun, 2022 06:42 IST|Sakshi

కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు

అనంతనాగేశ్వరన్‌ స్పష్టీకరణ

ఎకానమీ బలోపేతానికి ఇప్పటికే పలుచర్యలు

అవసరాలకు అనుగుణంగా క్రియాశీల విధానాలు  

ముంబై: మహమ్మారి కోవిడ్‌–19 మూడవ వేవ్‌ తర్వాత తిరిగి ఆర్థిక వృద్ధి ఊపందుకోవడానికి కేంద్ర మూలధన వ్యయాలు కొనసాగుతాయని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన ఒక బ్యాంకింగ్‌ కార్యక్రమంలో అన్నారు. 

పన్నులను తగ్గించడం, ప్రైవేటీకరణ కొనసాగింపు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి  ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం,  నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తేవడం (మానిటైజేషన్‌ డ్రైవ్‌) వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్‌– నాన్‌–బ్యాంకింగ్‌ నుంచి నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి,  ప్రైవేట్‌ రంగ భాగస్వాముల స్పందనలో ఇంకా పురోగతి లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి లక్ష్యంగా మరో మార్గంలో కేంద్రం మూలధన వ్యయం కొనసాగుతుందని అన్నారు.  2021–22లో కేంద్ర బడ్జెట్‌ మూలధన వ్యయాల విలువ రూ.6 లక్షల కోట్లయితే, ప్రభుత్వం రూ.5.92 లక్షల మేర ఖర్చు చేసిందని అనంత నాగేశ్వరన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

బడ్జెట్‌ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయగలిగితే ఇది ఎకానమీ పురోగతికి సంబంధించి పెద్ద విజయమే అవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే, భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడికి (2–6 శాతం శ్రేణిలో) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్‌ది కీలక పాత్ర అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బ్యాంకింగ్‌ తగిన సమర్ధవంతనీయమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రుణాలు మంజూరీలో బ్యాంకింగ్‌ కొంత అప్రమత్తత అవసరమేనని కూడా అన్నారు. 

మరిన్ని వార్తలు