ఏప్రిల్ నుంచి పెరగనున్న కారు, బైక్ ధరలు

24 Mar, 2021 18:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి కారు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల పెరుగుదల వల్ల ఇప్పటికే జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి. కేవలం స్వల్ప సమయంలోనే రెండో సారి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. 

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే వివిధ మోడల్స్, వేరియంట్ల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన వాహనా తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది. అందువల్ల, ఏప్రిల్‌లో కస్టమర్ల మీద అదనపు భారం పడే అవకాశం ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్‌యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్‌లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది.

ప్రత్యక్ష ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా ఇంధన, సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలపై భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కంపెనీలు రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల బైక్ కంపెనీ ధరలను ఏప్రిల్ నుంచి పెంచనున్నాయి. ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన ధరలను పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా ఉండటానికి తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అలాగే ప్రీమియం బైక్స్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 కొత్త వేరియంట్ ధరలు 2 శాతం పెరిగాయి.

చదవండి:

వన్‌ప్లస్‌ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా!

మరిన్ని వార్తలు