Car Sales Feb 2023: మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: టాటా స్థానం ఎంతంటే?

6 Mar, 2023 15:44 IST|Sakshi

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ఇటీవల గత నెల కార్ల విక్రయాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం వాహన అమ్మకాలు మునుపటికంటే కొంత పురోగతిని కనపరిచినట్లు తెలుస్తోంది. టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది, చివరి స్థానంలో ఎంజి మోటార్స్ చోటు సంపాదించింది.

2023 ఫిబ్రవరిలో 2,82,799 యూనిట్ల వాహనాలను విక్రయించి మునుపటి ఏడాది ఫిబ్రవరి (2,58,736 యూనిట్లు) నెలకంటే 13.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ జాబితాలో 1,18,892 యూనిట్ల కార్లను విక్రయించిన మారుతి మొదటి స్థానంలో నిలిచి, అమ్మకాల పరంగా 2022 ఫిబ్రవరి కంటే 8.47 శాతం వృద్ధిని పొందింది.

రెండవ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ ఫిబ్రవరి 2022 కంటే 1.08 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు గత నెలలో 39,106 యూనిట్లు. టాటా మోటార్స్ 38,965 యూనిట్లు విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది.

(ఇదీ చదవండి: నయా కారు విడుదలకు సిద్దమవుతున్న కియా మోటార్స్.. ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్!)

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరి కంటే 11,092 యూనిట్లను ఎక్కువ విక్రయించి నాలుగవ స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు 29,356 యూనిట్లు. కియా మోటార్స్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి, మునుపటి ఏడాది ఫిబ్రవరి కంటే 43.54 శాతం పెరుగుదలను పొందింది.

ఇక తరువాత స్థానాల్లో టయోట, స్కోడా, హోండా, రెనాల్ట్, ఎంజి మోటార్స్, నిస్సాన్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద కార్ల అమ్మకాలు 2022 ఫిబ్రవరి కంటే కూడా ఉత్తమంగా ఉన్నట్లు ఫాడా నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వారాగాలు ఆశిస్తున్నాయి.

మరిన్ని వార్తలు