హైస్పీడులో లగ్జరీ కార్‌ సేల్స్‌

3 Jul, 2021 05:11 IST|Sakshi

కరోనా కాలంలోనూ తగ్గని డిమాండ్‌

భారత్‌పై కంపెనీల భారీ ఆశలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెర్సిడెస్‌ మైబాహ్‌ జీఎల్‌ఎస్‌ 600.. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.43 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటారా? ఈ సూపర్‌ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి రాక ముందే ఇక్కడి కస్టమర్లు బుక్‌ చేసుకున్నారట. కంపెనీ భారత్‌ కోసం కేటాయించింది అటూ ఇటుగా 50 యూనిట్లు మాత్రమే. రెండవ లాట్‌ వచ్చేది 2022 జనవరి–మార్చిలోనే. సూపర్‌ లగ్జరీ కార్లకు భారత విపణిలో ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో ఇదొక్కటే చెబుతోంది. ఇక రూ.2.5 కోట్లకుపైగా ధర కలిగిన సూపర్‌ లగ్జరీ కార్లు 2019లో దేశవ్యాప్తంగా 265 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి ఈ ఏడాది విక్రయాలు ఉంటాయని లంబోర్గినీ అంచనా వేస్తోంది. మెర్సిడెస్‌ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి నుంచి మొత్తం 50కిపైగా కొత్త మోడళ్లు ఈ ఏడాది విడుదల కానుండటం కంపెనీల ఆసక్తికి నిదర్శనం. చిన్న మార్కెట్‌ అయినప్పటికీ భారత్‌పై సూపర్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు పెద్ద ఆశలే పెట్టుకున్నాయి.  

కోవిడ్‌–19 సమయంలోనూ..
దేశంలో సూపర్‌ లగ్జరీ కార్ల అమ్మకాలు కోవిడ్‌–19 సమయంలోనూ కొనసాగుతున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం 2020–21లో పోర్ష 249 కార్లను విక్రయించింది. లంబోర్గినీ 26 కార్లు, రోల్స్‌ రాయిస్‌ 21, ఫెరారీ 16, బెంట్లే నుంచి 12 కార్లు రోడ్డెక్కాయి. 2019–20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో లంబోర్గినీ ఏకంగా 100 శాతం వృద్ధి సాధించింది. ఊరూస్‌ మోడల్‌కు విపరీత డిమాండ్‌ కారణంగానే ఈ స్థాయి వృద్ధి నమోదు చేసింది. ఎక్స్‌షోరూంలో ఊరూస్‌ ధర రూ.3.15 కోట్ల నుంచి ప్రారంభం. మెర్సిడెస్‌ 2021లో 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి–జూన్‌లో ఇప్పటికే ఎనిమిది మోడళ్లు కొలువుదీరాయని తెలిపింది. కన్జూమర్‌ సెంటిమెంట్‌ తిరిగి బలపడిందనడానికి మైబాహ్‌ జీఎల్‌ఎస్‌ 600 బుకింగ్స్‌ ఉదాహరణగా వివరించింది. తొలి అర్ధ భాగంలో 50% వృద్ధి సాధించామని.. వచ్చే త్రైమాసికాల్లోనూ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోంది.

ఇన్నాళ్లు ఖర్చులకు దూరంగా..
షికార్లు, షాపింగ్‌కు సంపన్నులు తరచూ విదేశాలు చుట్టి వస్తుంటారు. కోవిడ్‌–19 మూలంగా విమాన ప్రయాణాలకు పరిమితులు ఉండడం, వైరస్‌ భయం కారణంగా గతేడాది నుంచి వీరంతా షికార్లు, షాపింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరి వద్ద ఆర్థిక సామర్థ్యం ఉందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ మార్టిన్‌ ష్వెంక్‌ తెలిపారు. ‘మెరుగైన ఇల్లు, కార్లవైపు వినియోగదార్లు చూస్తున్నారు. ఆరోగ్యం, జీవితంపై అనిశ్చితి నేపథ్యంలో స్తోమత ఉన్నప్పుడు ఈ రోజే ఎందుకు సొంతం చేసుకోకూడదు. ఎందుకు ఓ అయిదేళ్లు ఆగాలి అన్న భావన కస్టమర్లలో ఉంది. ఈ అంశమే అమ్మకాలకు బూస్ట్‌నిస్తోంది’ అని లంబోర్గినీ ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30–40 సూపర్‌ లగ్జరీ కార్లు రోడ్డెక్కుతున్నాయని వసంత్‌ మోటార్స్‌ ఫౌండర్‌ కొమ్మారెడ్డి సందీప్‌ రెడ్డి తెలిపారు. రూ.220 కోట్లకుపైగా సంపద కలిగిన అల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ ప్రస్తుతం దేశంలో 6,884 మంది ఉన్నారు.  అయిదేళ్లలో ఈ సంఖ్య 63% వృద్ధి చెందుతుం దని ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు