ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది

14 Aug, 2021 07:34 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్ధేశించిన తదుపరి దశ ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తే.. తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వస్తుందని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ స్పష్టం చేశారు.ఇదే జరిగితే అమ్మకాలు మరింత పడిపోతాయని,పరిశ్రమ ఇప్పటికే తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. 

గత కొన్ని సంవత్సరాలుగా ధరలు గణనీయంగా పెరగడంతో ప్రజలు కొత్త కార్లను కొనడం కష్టంగా ఉందని అన్నారు. ‘కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్‌ఈ) ప్రమాణాల అమలుకు ఇది సరైన సమయం కాదని నా అభిప్రాయం. పరిశ్రమ వృద్ధి సున్నా స్థాయికి వచ్చింది. కరోనా మహమ్మారి వేళ ప్రజల ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో కార్ల ధర ఇంకాస్త అధికమైతే పరిశ్రమ మరింత దిగజారుతుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. 

ఎందుకంటే ప్రజలకు కార్లను కొనే స్తోమత తగ్గింది’ అని పేర్కొన్నారు. బీఎస్‌–6 ఉద్గార నిబంధనలలో పొందుపరిచిన సీఏఎఫ్‌ఈ రెండవ దశ ప్రమాణాలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. అమలు తేదీని 2024 ఏప్రిల్‌ 1 తేదీకి వాయిదా వేయాల్సిందిగా సియామ్‌ సైతం ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించింది. సీఏఎఫ్‌ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వాహన సంస్థలు సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిందే.

చదవండి: గుజరాత్‌లో జర్మన్‌ బ్యాంక్‌, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?!

మరిన్ని వార్తలు