Q2 ఎఫెక్ట్‌- కేర్‌ రేటింగ్స్‌ దూకుడు

4 Nov, 2020 13:36 IST|Sakshi

నాలుగు రెట్లు ఎగసిన నికర లాభం

20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు షేరు

15 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రేటింగ్స్‌ దిగ్గజం.. కేర్‌ రేటింగ్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం రూ. 61 జంప్‌చేసి రూ. 365.4 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే ఏకంగా 6.29 మిలియన్‌ షేర్లు చేతులు మారాయి. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీలో 21 శాతం వాటాకాగా.. 15 రెట్లు అధిక పరిమాణం నమోదుకావడం గమనార్హం! రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి 4 లక్షలకుపైగా కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి.

పనితీరు భేష్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో కేర్‌ రేటింగ్స్‌ నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 36 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 76 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన విడుదల చేసిన ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు పెరగనుండటం, బాండ్‌ మార్కెట్ల పురోగతి, ప్రైవేట్‌ పెట్టుబడులు వంటి అంశాలు ఇకపై కంపెనీ పనితీరు మరింత మెరుగు పడేందుకు దోహదపడనున్నట్లు కేర్‌ రేటింగ్స్‌ సీఈవో అజయ్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు