పోర్టుల్లో సరుకు రవాణా డీలా

22 Mar, 2021 04:54 IST|Sakshi

ఏప్రిల్‌–ఫిబ్రవరి మధ్య నీరసించిన కార్గో ట్రాఫిక్‌  

న్యూఢిల్లీ: గత నెలలోనూ దేశీయంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ప్రధాన నౌకాశ్రయాలలో సరుకు రవాణా తగ్గింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) ఏప్రిల్‌– ఫిబ్రవరి మధ్య కాలంలో 12 ప్రధాన పోర్టులలో కార్గో ట్రాఫిక్‌ దాదాపు 7 శాతం క్షీణించింది. 600.6 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో 643 ఎంటీకిపైగా సరుకు రవాణా నమోదైంది. దేశీ పోర్టుల అసోసియేషన్‌(ఐపీఏ) రూపొందించిన తాజా నివేదిక వెల్లడించిన వివరాలివి. పారదీప్, మార్మగోవా మినహా మిగిలిన పోర్టులన్నీ కార్గో ట్రాఫిక్‌లో వెనకడుగు వేశాయి. పారదీప్‌లో 0.3 శాతం పుంజుకుని దాదాపు 103 ఎంటీకీ చేరగా.. 31 శాతం వృద్ధితో మార్మగోవా 19.3 ఎంటీ సరుకును హ్యాండిల్‌ చేసింది.

ప్రధానంగా ఎన్నోర్‌లోని కామరాజార్‌ పోర్ట్‌ సరుకు రవాణా 23.3 శాతం తక్కువగా 22.23 ఎంటీకి పరిమితంకాగా.. ముంబై, వీవో చిదంబరనార్‌లోనూ 12 శాతం చొప్పున ట్రాఫిక్‌ తగ్గింది. ఈ బాటలో కొచిన్, చెన్నై పోర్టు 10 శాతం వెనకడుగు వేయగా.. జేఎన్‌పీటీ 8 శాతం, దీన్‌దయాళ్‌(కాండ్లా) పోర్ట్, కోల్‌కతా(హాల్దియా) 6 శాతం చొప్పున క్షీణతను చవిచూశాయి. ఇదేవిధంగా న్యూమంగళూరు 5.3 శాతం, విశాఖపట్టణం 4.9 శాతం తక్కువగా కార్గోను హ్యాండిల్‌ చేశాయి. కాగా.. కోవిడ్‌–19 నేపథ్యంలో వరుసగా 11వ నెలలో అంటే ఫిబ్రవరిలో సైతం సరుకు రవాణా బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. గత 11 నెలల్లో ప్రధానంగా కంటెయినర్ల హ్యాండ్లింగ్‌ తగ్గిపోవడంతోపాటు.. పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ తదితర కమోడిటీల కార్గో భారీగా క్షీణించినట్లు తెలియజేసింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు