కార్లయిల్‌ చేతికి గ్రాన్సూల్స్‌ ఇండియా!

1 Dec, 2020 11:39 IST|Sakshi

42 శాతం ప్రమోటర్ల వాటా కొనుగోలుకి సన్నాహాలు

కార్లయిల్‌- గ్రాన్సూల్స్‌ మధ్య తుది దశకు చర్చలు?

ఒప్పందం విలువ బిలియన్‌ డాలర్లు(రూ. 7,400 కోట్లు)

డీల్‌ కుదిరితే మరో 24 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌

6 శాతం ప్లస్‌- సరికొత్త గరిష్టాన్ని తాకిన గ్రాన్సూల్స్‌ ఇండియా షేరు 

ముంబై‌, సాక్షి: ఫార్మా రంగ హైదరాబాద్‌ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియాలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కార్లయిల్‌ గ్రూప్‌ మెజారిటీ వాటాను కొనుగోలు చేసే వీలున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఏపీఐలు, కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ మ్యాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు కలిగిన గ్రాన్యూల్స్‌ ఇండియలో ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉంది. ఈ వాటా కొనుగోలుకి కార్లయిల్‌ గ్రూప్‌ ఇప్పటికే చర్చలు చేపట్టినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. చర్చలు తుది దశకు చేరినట్లు తెలియజేశాయి. అయితే ఈ వార్తలపై గ్రాన్సూల్స్‌ ఇండియా స్పందించకపోగా.. కంపెనీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సెబీ నిబంధనల ప్రకారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని వెల్లడించింది.  

బిలియన్‌ డాలర్లు
హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు కార్లయిల్ గ్రూప్‌‌ బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 7,400 కోట్లు)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. కంపెనీలో ప్రమోటర్లకున్న మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే.. సెబీ నిబంధనల ప్రకారం కార్లయిల్‌ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. సాధారణ వాటాదారుల నుంచి సైతం మరో 24 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుందని ప్రస్తావించారు. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న గ్రాన్సూల్స్‌ ఇండియా షేరు ఈ నేపథ్యంలో మరోసారి జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 6 శాతం జంప్‌చేసి రూ. 438కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 428 వద్ద ట్రేడవుతోంది. 

బయ్‌ రేటింగ్‌
గ్రాన్సూల్స్ ఇండియా కౌంటర్‌కు రీసెర్చ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ముడిసరుకుల కోసం చేపట్టిన బ్యాక్‌వార్డ్‌ ఇంటిగ్రేషన్‌ కంపెనీకి బలాన్ని చేకూర్చనున్నట్లు పేర్కొంది. తద్వారా పోటీ తీవ్రంగా ఉండే జనరిక్‌ మార్కెట్లో కంపెనీ బలంగా నిలవగలదని అభిప్రాయపడింది. మరిన్ని క్లిష్టతరమైన(కాంప్లెక్స్‌) ప్రొడక్టుల తయారీలోకి ప్రవేశించడం ద్వారా మార్జిన్లను మెరుగుపరచుకునే వీలున్నట్లు తెలియజేసింది. మార్జిన్లు కొనసాగితే.. విస్తరణకు అవసరమైన క్యాష్‌ఫ్లోకు అవకాశముంటుందని అభిప్రాయపడింది. ఈ అంశాల నేపథ్యంలో గ్రాన్సూల్స్‌ షేరుకి రూ. 460 టార్గెట్‌ ధరను అంచనా వేస్తోంది. 

మరిన్ని వార్తలు