కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు

21 May, 2022 01:18 IST|Sakshi

సరఫరా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

సీసీఐ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.  కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు.

కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి.

ఇవి నిజంగానే కోవిడ్‌ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు