ఫెడ్‌ ప్రకటనకు ముందు అప్రమత్తత

4 May, 2023 01:47 IST|Sakshi

సూచీల వరుస ర్యాలీకి బ్రేక్‌ 

సెన్సెక్స్‌ నష్టం 161 పాయింట్లు 

18,100 దిగువకు నిఫ్టీ 

ముంబై: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య పరపతి విధాన వైఖరి ప్రకటనకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో స్టాక్‌ సూచీల వరుస ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ షేర్ల బలహీన ట్రేడింగ్‌ సైతం ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం సెన్సెక్స్‌ 80 పాయింట్ల పతనంతో 61,275 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 18,114 వద్ద మొదలయ్యాయి.

ఇటీవల వరుస ర్యాలీ క్రమంలో బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లు భారీ ఎత్తున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఒక దశలో సెన్సెక్స్‌ 330 పాయింట్లు క్షీణించి 61,024 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పతనమైన 18,042 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంతమేర నష్టాలు తగ్గాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 161 పాయింట్లు నష్టపోయి 61,193 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 18,100 స్థాయి దిగువున 18,090 వద్ద నిలిచింది. దీంతో సెన్సెక్స్‌ ఎనిమిది రోజులు, నిఫ్టీ ఆరు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ల పడినట్లైంది. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.584 కోట్ల షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్‌ 161 పాయింట్ల పతనంతో బీఎస్‌ఈలో రూ.1.63 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఆసియా మార్కెట్లు 0.50% నుంచి ఒకటిన్నర శాతం దాకా నష్టపోయాయి.

మరిన్ని వార్తలు