గూగుల్‌ చెల్లింపు విధానాలపై విచారణ

10 Nov, 2020 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ చెల్లింపు విధానాలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. గూగుల్‌ పే, గూగుల్‌ ప్లే స్టోర్‌ చెల్లింపు విధానాల్లో కంపెనీ అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తోందన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది. గూగుల్‌కు చెందిన ‘పే’ అనేది డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం కాగా ‘ప్లే’ అనేది ఆండ్రాయిడ్‌ సాధనాలు, ఉత్పత్తులకు సంబంధించి యాప్‌ స్టోర్‌. తన గుత్తాధిపత్యంతో పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా గూగుల్‌ విధానాలు ఉంటున్నాయని సీసీఐ వ్యాఖ్యానించింది.

ప్లేస్టోర్‌లోని పెయిడ్‌ యాప్స్, ఇన్‌–యాప్‌ కొనుగోళ్లకు తప్పనిసరిగా గూగుల్‌ ప్లే చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలంటూ గూగుల్‌ నిబంధన విధించడం వల్ల డెవలపర్లకు వేరే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంది. భారీగా ఫీజులు వసూలు చేయడం వల్ల డెవలపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సీసీఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ, గూగుల్‌ ఐర్లాండ్, గూగుల్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌పై విచారణ జరపాలని తమ డైరెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. (వాట్సాప్‌ సందేశాలు వారంలో మాయం!)

జోరుమీదున్న యూపీఐ లావాదేవీలు
ఎస్‌బీఐ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్‌బీఐ వెల్లడించింది. అన్‌లాక్‌ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరులో రుణాలు పెరిగినప్పటికీ అక్టోబరులో ఆ ఊపు అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి 5.1 శాతం నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది.

సూక్ష్మ రుణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని రుణాలు 2020 సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో 48 శాతం తగ్గి రూ.1.02 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల్లో మ్యూచువల్‌ ఫండ్ల వాటా రూ.6,554 కోట్లు తగ్గి సెప్టెంబరులో రూ.47,678 కోట్లకు దిగొచ్చాయి. అక్టోబరులో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం అధికమైంది. ఈ–వే బిల్లులు రికార్డు స్థాయిలో సెప్టెంబరులో 5.74 కోట్లు నమోదైతే, అక్టోబరులో ఈ సంఖ్య 6.42 కోట్లకు ఎగశాయి. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. అత్యవసరం కాని ఉత్పత్తులు, సేవల్లో ఉన్న కంపెనీల ఆదాయం బలహీనపడింది. (యూట్యూబ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌!)

మరిన్ని వార్తలు