ఓలా, ఉబర్‌లకు షాక్‌! ఇకపై మీ ఆటలు చెల్లవు?

21 May, 2022 13:13 IST|Sakshi

ఓలా, ఉబర్‌కు సీసీపీఏ నోటీసులు 

అనుచిత వ్యాపార విధానాలు 

పాటిస్తున్నాయని ఆరోపణలు 

15 రోజుల్లో వివరణ     ఇవ్వాలని ఆదేశాలు  

న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని, వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయన్న ఆరోపణలపై క్యాబ్‌ సేవల సంస్థలు ఓలా, ఉబర్‌లకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఓలా, ఉబర్‌లకు నోటీసులు జారీ చేశాం. ఏడాది కాలంలో ఆయా సంస్థలు అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని, సర్వీసులు లోపభూయిష్టంగా ఉంటున్నాయని భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి‘ అని సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే తెలిపారు. 

కస్టమర్‌ సపోర్ట్‌ నుండి స్పందన లేకపోవడం, డ్రైవర్‌ ఆన్‌లైన్‌ చెల్లింపులకు నిరాకరించి నగదే ఇవ్వాలంటూ పట్టుబట్టడం, బుకింగ్‌లను ముందు ఒప్పుకుని తర్వాత రద్దు చేసుకునేలా కస్టమర్లపై ఒత్తిడి తేవడం .. ఫలితంగా కస్టమర్లు క్యాన్సిలేషన్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తుండటం వంటి సర్వీసు లోపాలను నోటీసుల్లో ప్రధానంగా చూపినట్లు వివరించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, అసమంజసమైన క్యాన్సిలేషన్‌ చార్జీలు తదితర ఇతర అంశాలు ఉన్నాయి. నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) గణాంకాల ప్రకారం 2021 ఏప్రిల్‌ 1 నుండి 2022 మే 1 వరకూ ఓలాపై 2,482, ఉబర్‌పై 770 ఫిర్యాదులొచ్చాయి.
 

చదవండి: క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్‌ !

మరిన్ని వార్తలు