వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ టైర్ల కంపెనీ సేల్స్‌ టెక్నిక్‌ మైండ్‌బ్లోయింగ్‌!

10 Sep, 2022 21:12 IST|Sakshi

వీధి చివర కిరాణా దుకాణంలో వాహన టైర్లు అందుబాటులో ఉంటే..? వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఆర్‌పీజీ గ్రూపు కంపెనీ సియట్‌ ఇదే ఆలోచనను అమలు చేస్తోంది. కస్టమర్లకు చేరువ అయ్యేందుకు కిరాణా దుకాణాలను సైతం వినియోగించుకోవాలన్నది ఈ సంస్థ ప్రణాళికగా ఉంది. పాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు కొనుగోలు చేసే షాపులో టైర్లు అమ్మడమే ఇప్పుడు కొత్త ట్రెండ్‌. నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల మాదిరిగా కాకుండా.. టైర్ల పరిశ్రమ పరిమిత వృద్ధితో కూడినది. ఈ పరిమిత మార్కెట్లోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేయాలన్నది సియట్‌ అభిమతంగా ఉంది.

అందుకే ఇప్పటి వరకు అసలు టైర్లను విక్రయించని దుకాణాలతో ఓ నెట్‌వర్క్‌ను సియట్‌ ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల వద్ద కూడా కస్టమర్ల కోసం టైర్లను అందుబాటులో ఉంచుతుంది. దీంతో దాదాపు దేశ ప్రజల్లో అధిక శాతాన్ని చేరుకోవచ్చన్నది కంపెనీ యోచన. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక అవసరం కోసం వెళ్లే వీధి దుకాణం వద్ద.. ‘సియట్‌’ టైర్లు కస్టమర్ల కళ్లలో పడుతుంటాయి. దీంతో బ్రాండ్‌కు ఉచిత ప్రచారం కూడా  లభించినట్టు అవుతుంది. 

నూతన నమూనా..
‘‘కిరాణా స్టోర్లు, పంక్చర్‌ రిపేర్‌ దుకాణాలు, ఓఈఎం మినీ అధీకృత సేవా కేంద్రాలు, వాహన విడిభాగాలు విక్రయించే స్టోర్ల యజమానులను సంప్రదించి, సియట్‌ టైర్లను విక్రయించాలని కోరాం’’అని సియట్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆర్ణబ్‌ బెనర్జీ తెలిపారు. ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉంది. 2021–22లో 1.34 కోట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. ఇందులో సగానికి పైన గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉండడం గమనార్హం. ఒక విధంగా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల మార్కెటింగ్‌ నమూనాను సియట్‌ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.

సియట్‌ కంపెనీ విక్రయించే ద్విచక్ర వాహన టైర్లలో 70 శాతం సంప్రదాయేతర స్టోర్ల నుంచే ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా ద్విచక్ర వాహన టైర్ల మార్కెట్లో సియట్‌ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2011 నాటికి 11 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటాను 30 శాతానికి పెంచుకుని మార్కెట్‌ లీడర్‌గా ఎదిగింది. మార్కెట్‌ అగ్రగామిగా ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ను సైతం టూవీలర్‌ విభాగంలో వెనక్కి నెట్టేసింది. కొన్నేళ్ల క్రితం 20,000 విక్రయ కేంద్రాలు ఉంటే, వాటిని 50,000కు పెంచుకున్నట్టు ఆర్ణబ్‌ బెనర్జీ వెల్లడించారు. కస్టమర్లకు మరింత చేరువ అయ్యే చర్యలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఇతర టైర్ల కంపెనీలతో పోలిస్తే డీలర్లు, సబ్‌ డీలర్లకు సియట్‌ విక్రయించే ధర అధికంగానే ఉన్నప్పటికీ.. తన వాటాను మాత్రం పెంచుకోగలుగుతోంది.

చదవండి: Elon Musk: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్‌ మస్క్‌

మరిన్ని వార్తలు