టైర్ల దిగ్గజం సియట్‌ ఆసక్తికర ఫలితాలు, లాభాలు ఢమాల్‌ 

8 Nov, 2022 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో టైర్ల తయారీ దిగ్గజం సియట్‌ లిమిటెడ్‌ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 81 శాతం క్షీణించి కేవలం రూ.7.83 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,452 కోట్ల నుంచి రూ. 2,894 కోట్లకు ఎగసింది. ఇన్‌పుట్‌ ఖర్చులు తమ లాభాలను ప్రభావితం చేశాయని కంపెనీ ప్రకటించింది. 

అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,402 కోట్ల నుంచి రూ. 2,864 కోట్లకు పెరిగాయి. రానున్న రెండేళ్లలో అంబర్‌నాథ్‌ ప్లాంటులో రేడియల్‌ టైర్ల తయారీ సామర్థ్యాన్ని రోజుకి 55 టన్నులకు పెంచేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు అదనంగా రూ. 396 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్టుబడులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. 
 

మరిన్ని వార్తలు