new cement council: 25 మంది సభ్యులు

8 Jul, 2021 14:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సిమెంట్‌ పరిశ్రమ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాల్మియా భారత్‌ గ్రూప్‌ సీఎండీ పునీత్‌ దాల్మియా నేతృత్వంలో 25 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఒక మండలిని (డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్‌ ఇండస్ట్రీ–డీసీసీఐ) ఏర్పాటు చేసింది. ఈ మండలి కాలపరిమితి రెండేళ్లని అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి శాఖ (డీపీఐఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది.  

దృష్టి సారించే అంశాలు.. 
పరిశ్రమలో వ్యర్థాల నివారణ, గరిష్ట ఉత్పత్తి సాధన, నాణ్యత పెంపు, వ్యయాల తగ్గింపు, ఉత్పిత్తి ప్రమాణాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ మండలి తగిన సిఫారసులు చేస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వ్యవస్థాపక సామర్థ్యం పూర్తి వినియోగం, పరిశ్రమ పనితీరు మెరుగుదల, అంతగా సామర్థ్యంలేని కర్మాగారాలకు సంబంధించి నిర్ణయాలు– సిఫారసులు, ఈ రంగంలో మానవ వనరులకు ప్రత్యేక శిక్షణ, అలాగే శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, కార్మికులకు భద్రతా ప్రమాణాలు, కొత్త పరికరాలు, విధానాల అభివృద్ధి, అత్యుత్తమ పని పరిస్థితుల కల్పన వంటి అంశాలపై కూడా మండలి దృష్టి సారిస్తుంది. అకౌంటింగ్, కాస్టింగ్‌ అంశాల్లో ప్రమాణాల స్థిరీకరణకు కృషి చేస్తుంది.  

సభ్యుల్లో కొందరు... 
ప్రకటన ప్రకారం కమిటీ సభ్యుల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఎండీ కేసీ జన్వార్, శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం బంగూర్,  ఇండియా సిమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ సింగ్‌; బిర్లా కార్పొరేషన్‌ సీఈఓ ప్రచేతా మజుందార్‌; జేకే సిమెంట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాధవకృష్ణ సింఘానియా, జెఎస్‌డబ్లు్య సిమెంట్‌  సీఈఓ నీలేష్‌ నార్వేకర్‌లు ఉన్నారు.

మరిన్ని వార్తలు