సీఈఎల్‌ విక్రయానికి స్వస్తి

29 Sep, 2022 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(సీఈఎల్‌) వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సీఈఎల్‌ కొనుగోలుకి బిడ్‌ను గెలుపొందిన కంపెనీ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) వద్ద అపరిష్కృతంగా ఉన్న న్యాయ వివాద విషయాన్ని వెల్లడించకపోవడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. సైంటిఫిక్, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ శాఖ(డీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో నడిచే కంపెనీ కొనుగోలుకి ఢిల్లీకి చెందిన నండల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ రూ. 210 కోట్ల విలువైన బిడ్‌ను దాఖలు చేయడం ద్వారా గెలుపొందింది.

దీంతో గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం సీఈఎల్‌ విక్రయానికి అనుమతించింది. అయితే ఈ ఏడాది జనవరిలో బిడ్డర్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పలు ఆరోపణల మధ్య ప్రభుత్వం ఎల్‌వోఐ జారీని పక్కనపెట్టింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీ వద్ద పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాన్ని బిడ్డర్‌ వెల్లడించకపోవడంతో సీఈఎల్‌ విక్రయాన్ని రద్దు చేసేందుకు నిర్ణయించింది.

చదవండి: స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. ఇది తప్పనిసరి!

మరిన్ని వార్తలు