ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి బిగ్‌ బూస్ట్‌! పీఎల్‌ఐకి ఒకే చెప్పిన కేంద్రం

15 Sep, 2021 15:49 IST|Sakshi

Production-Linked Incentive scheme: కరోనా కాటుకు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

పీఎం అధ్యక్షతన సమావేశం
వివిధ రంగాలకు ఉత్పత్తి అధారిత ప్రోత్సహకాలు అందించేందుకు కేంద్ర కేబినేట్‌ ప్రధానీ మోదీ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలంటూ  కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ. 26,058 కోట్లు కేటాయింపు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

టెక్నాలజీలో మార్పులు
ప్రొడక‌్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటీవ్‌ విధానం ద్వారా భారత్‌లోకి ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ వస్తుందని కేబినేట్‌ అభిప్రాయపడింది. పీఎల్‌ఐ విధానం వల్ల కొత్తగా రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 

కేబినేట్‌లో తీసుకున్న ఇతర నిర్ణయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు
- డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ. 5,000 కోట్లు పెట్టబడులు రావడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ సెక్టార్‌కి ప్రోత్సహకాలు అందించేందుకు రూ. 120 కోట్ల కేటాయింపులు.
- పీఎల్‌ఐ వల్ల భారత్‌లో తయారీ సామర్థ్యం పెరుగుతుంది. చైనాకు పోటీగా మాన్యుఫ్యాక​​​​​​‍్చరింగ్‌ సెక్టార్‌లో బలపడే అవకాశం
- పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల తయారీలో భారత్‌ను ముందువరుసలో నిలబెడుతుంది
-  ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పీఎల్‌ఐ బిగ్ బూస్ట్‌లా మారుతుంది
- మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌లో కొత్తగా 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుంది
- అంతర్జాతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో భారత్‌ వాటా కేవలం 2 శాతంగా ఉందని, తాజా నిర్ణయంతో అది పెరుగుతుంది.
- టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
- ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి నాలుగేళ్ల పాటు టెల్కోలకు మారటోరియం విధించింది.

చదవండి : ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇ‍న్ఫోసిస్‌.. నేడు ఆఖరు!

మరిన్ని వార్తలు