Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!

10 Jun, 2022 13:15 IST|Sakshi

నియంత్రణ లేకపోవడంపై సీఈఏ అనంతనాగేశ్వరన్‌ 

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోలపై నియంత్రణల లోపిస్తే లేదా కేంద్రీకృత నియంత్రణ యంత్రాంగం లేకపోతే అది కరీబియన్‌ సముద్రపు దొంగల ప్రపంచం మాదిరే తయారయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం, రూపాయి స్థిరత్వం పరంగా వచ్చిన లాభాలు దెబ్బతినకుండా ఎంతో తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.

గత నెలలో టెర్రా–లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఎంతో ముఖ్యమైన హెచ్చరికగా పేర్కొన్నారు. ‘‘క్రిప్టో కరెన్సీలను చూసి నేను ఉద్వేగం చెందను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బలీయమైన శక్తుల ప్రభావాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. అందుకే నేను ఫిన్‌టెక్‌ ఆధారిత ఈ తరహా ఆవిష్కరణలైన డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ (డెఫి), క్రిప్టోలను ఆహ్వానించే విషయంలో రక్షణాత్మకంగా వ్యవహరించాను. ఈ విషయంలో నేను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవిశంకర్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీలు, డెఫీలను అచ్చమైన ఫైనాన్షియల్‌ ఆవిష్కరణలుగా చూడడం కంటే.. నియంత్రణపరమైన మధ్యవర్తిత్వం అవసరమని రవిశంకర్‌ చెప్పారు. అవి మరింత వికేంద్రీకృతమైతే, నియంత్రణ లేకపోతే.. అది కరీబియన్‌ సముద్రపు దొంగల ప్రపంచం లేదా అందరి దగ్గర ఉన్నవి ఎవరో ఒకరు లాగేసుకునే ప్రపంచంగా మారిపోవచ్చు’’అని నాగేశ్వరన్‌ క్రిప్టోలపై తన అభిప్రాయాలను, నియంత్రణ అవసరాన్ని తెలియజేశారు. క్రిప్టోలను చట్టబద్ధం చేయవద్దని ఆర్‌బీఐ కేంద్రానికి బలంగా సూచించడం తెలిసిందే. దీంతో క్రిప్టో లాభాలపై పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ సొంతంగా డిజిటల్‌ రూపీని ఆవిష్కరించే కార్యక్రమంలో ఉండడం తెలిసిందే.    

చదవండి: Bloodbath In Crypto Markets: మార్కెట్‌ క్యాప్‌ ఢమాల్‌!

మరిన్ని వార్తలు