ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో?

24 Nov, 2021 07:47 IST|Sakshi

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు!

ఆర్‌బీఐ డిజిటల్‌ కరెన్సీకి అనుమతి 

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించి కీలక బిల్లును ప్రవేశపెట్టడానికి  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బిల్లును మంగళవారం కేంద్రం లిస్ట్‌ చేసింది. కేంద్ర క్యాబినెట్‌ బుధవారం చర్చకు లిస్ట్‌ చేసిన మొత్తం 26 బిల్లుల్లో క్రిప్టో కరెన్సీ  బిల్లు ఒకటని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులూ లిస్టింగ్‌లో ఉన్నాయి. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకూ పార్లమెంటు సీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. క్రిప్టోకరెన్సీ అంశంపై వివిధ మంత్రిత్వ శాఖలు,  ఆర్‌బీఐ అధికారులతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. క్రిప్టోకరెన్సీ నిషేధం తగదని, నియంత్రణే సరైన మార్గమని పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది.. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వెల్లడించడంతో దేశంలో క్రిప్టో కరెన్సీ ఖాయమన్న సందేహాలూ వ్యక్తం అయ్యాయి. అయితే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ మాత్రం దీనివల్ల దేశ ఫైనాన్షియల్, ఆర్థిక స్థిరత్వాల కు విఘాతమని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.  

భిన్న వాదనలు...: 
‘ది క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2021’ శీర్షికన బిల్లు లిస్ట్‌ కావడంతో దీనిపై భిన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. కొన్ని క్రిప్టో కరెన్సీలను నిషేధించి, మరికొన్నింటిపై నియంత్రణ విధిస్తుందని, దీనితోపాటు ఆర్‌బీఐ జారీ చేసే డిజిటల్‌ కరెన్సీ రెగ్యులేట్‌ చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.  ‘‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్‌ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి బిల్లు దోహదపడుతుంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కూడా కోరుతోంది, అయితే, క్రిప్టోకరెన్సీ, దాని ప్రయోజనాల కోణంలో  అంతర్లీన సాంకేతికతను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులను బిల్లు అనుమతిస్తుంది‘అని లోక్‌సభ వెబ్‌సైట్‌లో బిల్లు లిస్టింగ్‌ వివరాలు తెలియజేస్తున్నాయి.  

రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ 
ఇంకా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లుపై కూడా బుధవారం చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

చదవండి: క్రిప్టో కరెన్సీపై ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు