రూ. 1.62 లక్షల కోట్ల విలువైన ఆస్తులు మోనిటైజ్‌,రాహుల్‌కి ఆస్తుల మోనిటైజ్‌ అంటే ఏంటో తెలుసా?

9 Aug, 2022 07:04 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) రూ. 1.62 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులు మోనిటైజ్‌ (ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం లేదా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి మార్గం ద్వారా ఆదాయ సముపార్జన) సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చతుర్వేది ఈ మేరకు ఒక లిఖిత పూర్వక ప్రకటన చేస్తూ, 2021–22లో దాదాపు రూ.97,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను మోనిటైజ్‌ చేయడం జరిగిందని తెలిపారు.

2025 వరకు నాలుగు సంవత్సరాలలో విద్యుత్‌ నుండి రహదారి, రైల్వేల వరకు అన్ని రంగాలలో మౌలిక సదుపాయాల ఆస్తుల విలువను అన్‌లాక్‌ చేయడానికి ప్రభుత్వం గత సంవత్సరం రూ. 6 లక్షల కోట్ల నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 60 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తులను కేంద్రం అమ్మేస్తుందన్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ గతంలో విమర్శించారు.

అయితే దీనిపై ఆర్థికమంత్రి సీతారామన్‌ అప్పట్లో స్పందిస్తూ, ‘‘అసలు రాహుల్‌కు ఆస్తుల మోనిటైజ్‌ అంటే తెలుసా?’’ అని ప్రశ్నించారు. ఎన్‌ఎంపీ కింద గుర్తించిన రంగాలలో రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, గిడ్డంగులు, గ్యాస్‌ అండ్‌ ఉత్పత్తి పైప్‌లైన్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసార కార్యకలాపాలు,  మైనింగ్, టెలికం, స్టేడియం, పట్టణ రియల్టీ వంటివి ఉన్నాయి. అసెట్స్‌ మోనిటైజ్‌ స్కీమ్‌ పట్ల ప్రైవేటు దిగ్గజ సంస్థల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు మంత్రి తెలిపారు.  
 

మరిన్ని వార్తలు