పెట్రోల్‌, డీజిల్‌లతోకాదు.. ..ఇథనాల్‌తో నడిచేలా ..

30 Jun, 2021 12:21 IST|Sakshi

ఫ్లెక్స్‌ ఇంజన్ల తయారీకి  కేంద్రం రూట్‌మ్యాప్‌ 

పెట్రోల్‌, డీజిల్‌ దిగుమతులు తగ్గించేలా వ్యూహం

దేశీ పంట ఉత్పత్తులతో భారీ ఎత్తున ఇథనాల్‌ తయారీ

ఇథనాల్‌తో రైతులకు అదనపు  ఆదాయం 

పెరగడమే తప్ప తరగడం అనే మాట లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. ఫ్యూయల్‌ ఛార్జీలకు ప్రత్యామ్నయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లుదామంటే వాటి ధర ఎక్కువ. దీంతో వాహనదారుల సమస్యలకు ఇథనాల్‌ ఇంజన్లు ప్రత్యామ్నాయంగా నిలవబోత్నున్నాయి. 

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజన్లు
పెట్రోలుతోనే కాకుండా ఇథనాల్‌తో కూడా నడిచే విధంగా ‘ఫ్లెక్స్‌ ఇంజన్లు’ డిజైన్‌ చేయాలంటూ వాహన తయారీ కంపెనీలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ ఇటీవల కోరారు. ఫ్లెక్స్‌ ఇంజన్లు అంటే రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహనాలు. ప్రస్తుతం మనకు పెట్రోల్‌, సీఎన్‌జీ (గ్యాస్‌)తో నడిచే ఫ్లెక్స్‌ ఇంజన్‌ వాహనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్‌, ఇథనాల్‌లతో నడిచే  ఫెక్స్‌ ఇంజన్లు రూపొందించేందుకు వాహన తయారీ సంస్థలు ముందుకు వచ్చేలా  కేంద్రం కార్యాచరణ సిద్ధం చేయనుంది.

పంట ఉత్పత్తులతో
విదేశాల్లో గోధుమలు, మొక్కజోన్న, వరి ధాన్యాల నుంచి కూడా ఇథనాల్‌ ముడి పదార్థాలను తయారు చేస్తున్నారు. మనదగ్గర ఇథనాల్‌ తయారు చేసేందుకు కేవలం చెరుకు ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర సమృద్ధిగా ఉన్న చెరుకుతో పాటు వరి, గోదుమ, మొక్కజొన్నల నుంచి భారీ ఎత్తున ఇథనాల్‌ తయారు చేసేందుకు అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల   రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. 

గతంలోనూ
గతంలో  పలు కంపెనీలు ఇథనాల్‌తో నడిచే వాహనాలు తయారు చేసినా అవేవీ మార్కెట్‌లోకి రాలేదు. ఇప్పుడు కొత్తగా ఇథనాల్‌ ఉత్పత్తి పెంచడంతో పాటు ఇథనాల్‌ బంకులు కూడా  ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు ఇథనాల్‌ ఆధారిత ఫ్లెక్స్‌ ఇంజన్‌ వాహనాల తయారీపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 

20 శాతం
గత ఎనిమిదేళ్లుగా పెట్రోలులో ఇథనాల్‌లు కలిపే విక్రయిస్తున్నారు. అయితే పెట్రోలులో కలిపే ఇథనాల్‌ శాతాన్ని క్రమంగా ఒక శాతం నుంచి 10 వరకు తీసుకొచ్చారు. రాబోయే మూడేళ్లలో 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌, డీజిల్లో కలపాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. 

చదవండి : దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ స్పోర్ట్స్‌ పరిశ్రమ

మరిన్ని వార్తలు