ఆర్‌బీఐ గుప్పిట్లోకి.. లక్ష్మీ వి‘లాస్‌’!

18 Nov, 2020 05:07 IST|Sakshi

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌పై మారటోరియం అస్త్రం

కేంద్రం కీలక నిర్ణయం

డిసెంబర్‌ 16 వరకూ అమలు

డిపాజిటర్‌కు విత్‌డ్రాయెల్‌ పరిమితి రూ. 25,000 

ఆర్‌బీఐ ముందస్తు అనుమతితో మరింత విత్‌డ్రాయెల్‌కూ వెసులుబాటు

బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా టీఎన్‌ మనోహరన్‌ నియామకం

ముంబై: ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం అ్రస్తాన్ని ప్రయోగించింది.  చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌పై  మంగళవారం నుంచి (17వ తేదీ) నుంచి 30 రోజులపాటు– డిసెంబర్‌ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  ప్రభుత్వ నిర్ణయం ప్రకారం,  ఒక బ్యాంక్‌ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా,  కేవలం రూ.25,000 వరకూ మాత్రమే (30 రోజుల వరకూ)  వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్‌బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.  బ్యాంక్‌ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సలహా మేరకు కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది.  బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్‌ మాజీ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ టీఎన్‌ మనోహరన్‌ నియమితులయ్యారు.  

ప్రత్యామ్నాయం లేకే...: ఆర్‌బీఐ 
‘‘బ్యాంకుకు సంబంధించి విశ్వసనీయ పునరుద్ధరణ ప్రణాళికలేని పరిస్థితుల్లో డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్‌ స్థిరత్వం, ఫైనాన్షియల్‌ వ్యవహారాల పటిష్టత ముఖ్యం. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్, 1949 సెక్షన్‌ 45 కింద బ్యాంక్‌పై మారటోరియం విధించాలని కేంద్రానికి సిఫారసు చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆర్‌బీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 17వ తేదీ నుంచి 30 రోజులపాటు... అంటే డిసెంబర్‌ 16వ తేదీ వరకూ అమలుజరిగే విధంగా బ్యాంక్‌పై మారటోరియం విధించింది’’ అని ఈ పరిణామానికి సంబంధించి వెలువడిన ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. తాజా మారటోరియం ప్రకారం, సేవింగ్స్, కరెంట్‌ లేదా మరే డిపాజిట్‌ అకౌంట్‌ నుంచీ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ తనకు తానుగా, ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందకుండా రూ.25,000 మించి ఖాతాదారుకు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది.

డీబీఎస్‌ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదన 
తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం... డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా (డీబీఐఎల్‌)తో విలీనానికి సంబంధించి ముసాయిదా పథకాన్ని కూడా ఆర్‌బీఐ వెలువరించింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీన ప్రతిపాదనకు గ్రీన్  సిగ్నల్‌ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ  డీబీఐఎల్‌ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్‌ వెల్లడించింది. సర్వత్రా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ విలీన డీల్‌తో ఎల్‌వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఉద్యోగులకు కొంత ఊరట లభించగలదని పేర్కొంది. అలాగే డీబీఐఎల్‌ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని తెలిపింది. 
బీఎస్‌ఈలో బ్యాంక్‌ షేరు మంగళవారం 1% నష్టంతో రూ. 15.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ఆర్‌బీఐ మారటోరియం ఆదేశాలు వెలువడ్డాయి.

బ్యాంక్‌ వ్యాపారం ఇలా... 
రిటైల్, మిడ్‌–మార్కెట్, కార్పొరేట్‌ రంగాల్లో బిజినెస్‌ చేస్తున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంకు– వీఎస్‌ఎన్‌ రామలింగ చెట్టియార్‌ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు.  2019 జూన్‌ 30వ తేదీ నాటికి 569 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో ఏడు కమర్షియల్‌ బ్యాంక్‌ బ్రాంచీలుకాగా, ఒకటి శాటిలైట్‌ బ్రాంచ్‌. ఐదు ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్లు, ఏడు ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకుకు బ్రాంచీలు ఉన్నాయి. దాదాపు 1,047 ఏటీఎంలు సేవలు అందిస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్‌ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్‌పీఏ)ల పరిమాణం 24.45 శాతంగా ఉంటే, నికరంగా చూస్తే ఇది 7.01 శాతంగా ఉంది. బ్యాంకులో దాదాపు నాలుగువేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు