కరోనా టీకా సంస్థలకు బూస్ట్‌

21 Apr, 2021 02:29 IST|Sakshi

ఉత్పత్తి పెంచేందుకు రూ. 4,500 కోట్లు అడ్వాన్స్‌ 

ఫైనాన్స్‌ బిల్లు సవరణలకు ఆమోదం 

కేంద్రం నిర్ణయాలు

న్యూఢిల్లీ: త్వరలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా కోవిడ్‌–19 టీకాలు వేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), భారత్‌ బయోటెక్‌ తదితర టీకాల తయారీ సంస్థలకు భవిష్యత్‌లో సరఫరా చేయబోయే వ్యాక్సిన్లకు సంబంధించి రూ. 4,500 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకునేందుకు తోడ్పడేలా బ్యాంక్‌ గ్యారంటీ అవసరం లేకుండా అడ్వాన్స్‌ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలను సడలించినట్లు వివరించాయి. దీనికి క్యాబినెట్‌ అనుమతి అవసరం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ‘క్రెడిట్‌ లైన్‌ రూపంలో ఈ నిధులు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని భావిస్తున్నాను.

ఇందుకు ఆర్థిక మంత్రికి అధికారాలు ఉంటాయి. దీనికి క్యాబినెట్‌ ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వం తలపెట్టిన టీకాల కొనుగోలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్ల సరఫరాకు ఇది తోడ్పడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం ఎస్‌ఐఐకి రూ. 3,000 కోట్లు, భారత్‌ బయోటెక్‌కు సుమారు రూ. 1,500 కోట్లు లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్‌ఐఐ సీఈవో అదార్‌ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ‘దేశీయంగా టీకాల ఉత్పత్తి, పంపిణీకి తోడ్పడేలా విధానపరమైన మార్పులు చేయడంతో పాటు సత్వరం ఆర్థిక సహాయం చేయడంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు‘ అని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో పూనావాలా ట్వీట్‌ చేశారు. మరోవైపు, పన్నుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు సంబం ధించి ఫైనాన్స్‌ బిల్లు 2021కి చేసిన సవరణలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

కోవిడ్‌ వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం మినహాయింపు!
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే కోవిడ్‌–19 వ్యాక్సిన్లపై ప్రభుత్వం దిగుమతి సుంకం మినహాయించే అవకాశం ఉంది. విదేశీ వ్యాక్సిన్ల ధర తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దిగుమతయ్యే వ్యాక్సిన్లపై ప్రస్తుతం 10% కస్టమ్స్‌ డ్యూటీ (దిగుమతి సుంకం) ఉంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల ప్రారంభంలో రష్యాకు చెందిన స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ భారత్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. మరోవైపు అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా మోడెర్నా, జాన్సన్‌ సైతం ప్రభుత్వానికి విన్నవించాయి. దిగుమతి అయ్యే వ్యాక్సిన్లపై కస్టమ్స్‌ డ్యూటీతోపాటు 16.5% ఐ–జీఎస్టీ, సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌చార్జ్‌ వసూలు చేస్తున్నారు. వ్యాక్సిన్లను భారత్‌కు సరఫరా చేసేందుకు అనుమతించాల్సిందిగా విదేశీ సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరిన వెంటనే కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్‌లో తమ వ్యాక్సిన్‌కు అనుమతి కోసం ఫైజర్‌ ప్రభుత్వాన్ని సంప్రదించిన సమయంలోనే సుంకం మినహాయింపు అంశంపై చర్చ మొదలైంది.

ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్‌ ఒప్పందానికి ఓకే..
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ), చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆ్రస్టేలియా అండ్‌ న్యూజిలాండ్‌ (సీఏఏఎన్‌జెడ్‌) మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సభ్యుల అర్హతలకు సంబంధించి రెండు సంస్థలూ పరస్పరం గుర్తింపునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారతీయ చార్టర్డ్‌ అకౌంటెంట్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు కూడా ఇది తోడ్పడగలదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఐసీఏఐ, సర్టిఫైడ్‌ ప్రాక్టీసింగ్‌ అకౌంటెంట్‌ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు వివరించింది.  

తాల్చేర్‌ ఫెర్టిలైజర్‌ యూరియాకు సబ్సిడీ 
కోల్‌–గ్యాసిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా యూరియా ఉత్పత్తి చేసే తాల్చేర్‌ ఫెర్టిలైజర్స్‌ (టీఎఫ్‌ఎల్‌) కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన సబ్సిడీ విధానానికి క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. గెయిల్, కోల్‌ ఇండియా, ఆర్‌సీఎఫ్,  ఎఫ్‌సీఐఎల్‌ కలిసి జాయింట్‌ వెంచర్‌గా 2015లో దీన్ని ఏర్పాటు చేశాయి. ఒరిస్సాలో ఎఫ్‌సీఐఎల్‌కి చెందిన తాల్చేర్‌ ప్లాంట్‌ను పునరుద్ధరించే దిశగా టీఎఫ్‌ఎల్‌ 12.7 లక్షల టన్నుల వార్షిక సామర్ధ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. యూరియా ఉత్పత్తికి సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ఎల్‌ఎన్‌జీ దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. 

>
మరిన్ని వార్తలు