Privatisation: అమ్మకానికి మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు!

15 Dec, 2021 07:42 IST|Sakshi

డిజిన్వెస్ట్‌మెంట్‌కు 2 కంపెనీలు రెడీ

జాబితాలో పీడీఐఎల్, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ 

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ తాజాగా ప్రాజెక్ట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌(పీడీఐఎల్‌)తోపాటు హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో వాటా విక్రయానికి తెరతీసింది. ఇందుకు అనుగుణంగా ఈ పీఎస్‌యూల కొనుగోలుకి ఆసక్తిగల కంపెనీల నుంచి గ్లోబల్‌ బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్‌ దాఖలుకు 2022 జనవరి 31 చివరి తేదీగా ప్రకటించింది. 

పీఎస్‌యూల ప్రయివేటైజేషన్‌లో భాగంగా కొనుగోలుకి ఆసక్తి(ఈవోఐ)ని వ్యక్తం చేసేందుకు 45 రోజులకుపైగా గడువును ఇచ్చినట్లు దీపమ్‌ ట్వీట్‌ చేసింది. మినీరత్న కేటగిరీ–1 కంపెనీ పీడీఐఎల్‌ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. కంపెనీ ప్రధానంగా డిజైన్, ఇంజినీరింగ్, కన్సల్టెన్సీ, తత్సంబంధిత ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ సర్వీసులను అందిస్తోంది. ఇక హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఇప్పటివరకూ ఎస్‌యూయూటీఐతో కలిపి సీపీఎస్‌ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 9,330 కోట్లు సమకూర్చుకున్నట్లు ఈ సందర్భంగా దీపమ్‌ వెల్లడించింది.

చదవండి: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

మరిన్ని వార్తలు