కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు తీపికబురు, త్వరలో జీతం పెరగనుందా!

5 Feb, 2023 17:44 IST|Sakshi

మోదీ సర్కార్‌ ఉద్యోగులకు తీపికబురు చెప్పనుంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈసారి ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA) 4 శాతం మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పెంపు జరిగితే కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 42 శాతానికి చేరుకుంటుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల శాలరీ కూడా పైకి కదలనుంది. ప్రస్తుతం వారి డీఏ 38 శాతంగా ఉంది.

ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్, జనరల్ సెక్రటరీ, శివ గోపాల్ మిశ్రా దీనిపై మాట్లాడుతూ, "డిసెంబర్ 2022కి సంబంధించిన సీపీఐ-ఐడబ్ల్యూ జనవరి 31, 2023న విడుదలైంది. కరువు భత్యం పెంపు 4.23 శాతంగా ఉంది.  అయితే కేంద్రం పాయింట్ తర్వాత ఉన్న నెంబర్లను పరిగణలోకి తీసుకోదు. అందువల్ల డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని వివరించారు. అందువల్ల డీఏ అనేది 42 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం దాని ఆదాయ చిక్కులతో పాటు డీఏ పెంపు ప్రతిపాదనను రూపొందిస్తుందని, ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను ఉంచుతుందని ఆయన వెల్లడించారు. ఈ డీఏ పెంపు అనేది జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరువు భత్యం పొందుతున్నారు. గతంలో చివరి సవరణ సెప్టెంబర్ 28, 2022న జరగగా, ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు