కేంద్ర బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!

17 Jan, 2022 18:37 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం మునుపెన్నడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా ఈ మహమ్మారి వల్ల దేశంలోని దిగువ మధ్యతరగతి, పేదల ఆదాయం పడిపోవడంతో పుట గడవడమే కష్టం అవుతుంది. జనజీవనం ఇప్పుడిప్పుడే కుడుటపడుతున్న తరుణంలో మరోసారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే నెలలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

అందుకే, ప్రభుత్వం పేదలకు అందించే సబ్సిడీలను 2022-23లో కట్ చేయాలని చూస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రాబోయే బడ్జెట్‌లో ఆహార, ఎరువుల సబ్సిడీలను వరుసగా రూ.2.60 లక్షల కోట్లు, రూ.90,000 కోట్లుగా కేటాయించాలని భావిస్తున్నారు. ఇది ఆర్థిక సంవత్సరం 2022 కోసం సవరించిన అంచనాల కంటే చాలా తక్కువ. ఎకనామిక్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ బిల్లు మొత్తం సుమారు రూ.5.35-5.45 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ మొత్తాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన జిడిపిలో ఆర్థిక లోటు 6.8 శాతం కంటే ఎఫ్‌వై23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6.5 శాతంగా ఉంటుందని ఒక అధికారి తెలిపారు. మన ఆర్థిక లక్ష్యాల మేరకు ఆహారం, ఎరువులపై సబ్సిడీలను సవరించే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి తెలిపారు.

(చదవండి: అదిరిపోయిన స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్.. దీని రేంజ్, ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!)

మరిన్ని వార్తలు