క్రిప్టో.. తగ్గేదేలే!

16 Nov, 2021 05:30 IST|Sakshi

క్రిప్టో కాయిన్, టోకెన్లకు పెరుగుతున్న ఆదరణ

భారత్‌లో ఇప్పటికే 10 కోట్ల మంది చేరిక

క్రిప్టో యూజర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్‌1

రూ.75,000 కోట్ల వరకు పెట్టుబడులు

నియంత్రణలపై కేంద్ర ప్రభుత్వం చర్చలు

బిట్‌కాయిన్‌.. ఎథీరియమ్‌.. షిబా ఇను, డోజికాయిన్‌.. ఇన్వెస్టర్ల ప్రపంచం క్రిప్టోల గురించి తెగ చర్చించుకుంటోంది. స్పెక్యులేటివ్‌ మద్దతుతో ఉన్నట్టుండి ఏదో ఒక క్రిప్టో టోకెన్‌ 24 గంటల్లోనే వందలు, వేల రెట్లు పెరిగేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలోనూ, ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లలో చెప్పలేనంత ఆసక్తి ఏర్పడుతోంది. క్రిప్టోల గురించి పెద్దగా తెలియకపోయినా.. ఫోన్‌ నుంచే డిజిటల్‌గా క్రిప్టో ట్రేడింగ్‌ ఖాతా తెరిచేసి ఎంతో కొంత పెట్టుబడితో తమ దృష్టిలో పడిన క్రిప్టోను కొనుగోలు చేసే వాతావరణం నెలకొందనడంలో సందేహం లేదు. మనదేశంలోనే అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెట్టుబడులన్నీ క్రిప్టోలను వెతుక్కుంటూ వెళుతున్నాయి. సామాన్య ఇన్వెస్టర్లకే ఈ ధోరణి పరిమితం కాలేదు. ప్రముఖ కంపెనీల దగ్గర్నుంచి, ఫండ్‌ మేనేజర్ల వరకు అందరూ క్రిప్టోల్లో పెట్టుబడుల అవకాశాలను వెతుక్కుంటున్నారు. కాకపోతే, వీటితో ఎలా వేగాలో ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులకు అర్థం కాకుండా ఉంది.

క్రిప్టో కరెన్సీ అంటే..?
క్రిప్టోకరెన్సీలు అనేవి డిజిటల్‌ ఆస్తులు. ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే క్రిప్టో కాయిన్లు, టోకెన్లను క్రిప్టోకరెన్సీలుగా పిలుస్తున్నారు. వీటిని పెట్టుబడి సాధనాలుగాను, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు చెల్లింపుల సాధనాలుగానూ వినియోగిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ అన్నది భౌతికంగా ఉండదు. డిజిటల్‌లోనే ఉంటుంది. రూపీ, డాలర్, యూరో మాదిరిగా ఇవి ఫియట్‌ కరెన్సీలు కావు. ఎవరో ఒకరు నియం త్రించేవి కావు. వీటిపై సెంట్రల్‌ బ్యాంకుల నియంత్రణ ఉండదు. కనుక వీటిని డీసెంట్రలైజ్డ్‌గా పేర్కొంటారు. ఇంటర్నెట్‌ వేదికగా యూజర్ల మధ్య ఇవి చెలామణి అవుతుంటాయి. ప్రతీ కాయిన్‌ లేదా టోకెన్‌ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్‌ లేదా కోడ్‌తో రూపొందించబడి ఉంటాయి. కనుక వీటిని ట్రాక్‌ చేయడం, గుర్తించడం సులభతరం. క్రిప్టోగ్రఫీ, కరె న్సీ రెండింటి కలయికే.. క్రిప్టోకరెన్సీగా వాడుకలోకి వచ్చింది. క్రిప్టోకరెన్సీ లు క్రిప్టోగ్రఫిక్‌ సాంకేతికత ఆధారంగా లావాదేవీలను ధ్రువీకరిస్తుంటాయి.  

బ్లాక్‌ చైన్‌..
క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చైన్‌ వేర్వేరు. క్రిప్టోకరెన్సీల అస్తిత్వానికి బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తోడ్పడుతుంది. బ్లాక్‌చైన్‌ అన్నది డిజిటల్‌ లెడ్జర్‌. మొత్తం కంప్యూటర్ల నెట్‌వర్క్‌ పరిధిలో ప్రతి ఒక్క లావాదేవీని రికార్డెడ్‌గా నిర్వహిస్తుంటుంది. ప్రతీ నూతన లావాదేవీ నెట్‌వర్క్‌ పరిధిలోని ప్రతీ భాగస్వామి లెడ్జర్‌లో నమోదవుతుంది. ఎవరో ఒకరు నియంత్రించేది కాకుండా అవతరించిన సాంకేతికతే బ్లాక్‌చైన్‌. దీనికి ఉన్న ప్రత్యేకత ఇదే. బ్లాక్‌చెయిన్‌ అన్నది సమాచారాన్ని ప్యాకెట్‌ల రూపంలో కలిగి ఉంటుంది. దీన్ని బ్లాక్‌లుగా పిలుస్తారు. ఈ బ్లాక్‌లు ఒక చైన్‌ (గొలుసుగా)గా అనుసంధానమై ఉంటా యి. ఈ బ్లాక్‌లతో కూడిన చైన్‌ను ఎడిట్‌ చేయడానికి (దిద్దడానికి), మార్చడానికి అవకాశం ఉండదు.

ఎంతో పటిష్టంగా ఉంటుంది. బ్లాక్‌ చైన్‌లో ప్రతీ లావాదేవీ సురక్షితంగా నమోదై ఉంటుంది. అందుకే బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. బిట్‌కాయిన్, ఎథీరియమ్‌ ఇవన్నీ బ్లాక్‌ చైన్‌ సాంకేతికత ఆధారంగా ఏర్పడినవే. కాకపోతే వీటిల్లో ఎథీరియమ్, సొలానా తదితర బ్లాక్‌ చెయిన్లు.. తమ నెట్‌వర్క్‌పై స్మార్ట్‌ కాంట్రాక్టుల (కోడ్‌)ను సృష్టించి, నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్లను ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవచ్చు. ఈ నెట్‌ వర్క్‌ల సాయంతో ఎన్నో క్రిప్టో టోకెన్ల సృష్టికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పాలిగాన్‌ (మేటి క్‌) అన్నది ఎథీరియమ్‌ బ్లాక్‌ చైన్‌పై ఏర్పడిందే.

ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్రిప్టో ఇన్వెస్టర్లు 18–34 ఏళ్లలోపు వారే. మరో 20 శాతం మంది 35–44 ఏళ్ల వయసులోపు వారున్నట్టు ఫైండర్స్‌ క్రిప్టోకరెన్సీ నివేదిక స్పష్టం చేస్తోంది. టెస్లా, ఫేస్‌బుక్, పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్, మైక్రో స్ట్రాటజీ, బ్లాక్‌రాక్, ఏఆర్‌కే ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడం, ఈ టెక్నాలజీపై పనిచేయడం మొదలు పెట్టాయి. టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ సైతం బిట్‌కాయిన్, డోజికాయన్‌ తదితర క్రిప్టోల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టు స్వయంగా ప్రకటించారు.

ఏది చేస్తే మెరుగు..?
క్రిప్టోలను అధికారిక కరెన్సీలుగా ఆమోదించే పరిస్థితి లేదు. పెట్టుబడి సాధనాలుగా వీటిని పరిగణించి, పన్నుల రూపంలో ఆదాయం రాబట్టుకోవాలన్న యోచనను కేంద్రంలోని కొందరు సీనియర్‌ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వినూత్న సాంకేతికతకు దారిచూపుతున్న క్రిప్టోలను పూర్తిగా నిషేధించినట్టయితే భారత్‌ మంచి అవకాశం కోల్పోయినట్టు అవుతుందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం క్రిప్టోలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ టెక్నాలజీపై నిపుణులు, భాగస్వాములతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు.

యువతను తప్పుదోవ పట్టించే విధంగా క్రిప్టోలపై ప్రచారం, ప్రకటనలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, క్రిప్టోలను అనుమతించడానికి ఆర్‌బీఐ సుముఖంగా లేదు. స్థూల ఆర్థిక పరిస్థితులకు వీటితో పెద్ద సమస్య వచ్చి పడుతుందని, ప్రపంచవ్యాప్తంగా నియంత్రణల పరిధిలో లేని ఇవి పెట్టుబడి సాధనాలుగా ఆమోదనీయం కాదని ఆర్‌బీఐ తన అభిప్రాయంగా కేంద్రానికి తెలియజేసింది.

క్రిప్టోల్లో పెట్టుబడులకు అనుమతిస్తే.. అవి ఉగ్రవాదులకు, మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళలను కూడా దర్యాప్తు సంస్థలు, ఆర్‌బీఐ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. క్రిప్టో లావాదేవీలపై కఠిన నియంత్రణలు ఉండాలని, లేదంటే ఇంటి పొదుపులు అనియంత్రిత సాధనాల్లోకి మళ్లితే ప్రమాదంలో పడినట్టు అవుతుందన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. దేశంలో క్రిప్టోల నిషేధం లేదా నియంత్రణకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చట్టం లేనందున రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

ఎన్ని క్రిప్టోలు ఉన్నాయి?
బిట్‌ కాయిన్‌ను మొదటి క్రిప్టోకరెన్సీగా చెబుతారు. 2009లో ఇది ఏర్పడింది. దీని ఆవిష్కర్త సతోషి నకమొటో. ఎవరైనా ఇందులో పాల్గొనే విధంగా డీసెంట్రలైజ్డ్‌ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరికి పరిమితం కాకుండా.. అందరికీ చెందేలా దీన్ని రూపొందించడం విశేషం. క్రిప్టో కరెన్సీ యూనిట్లను మైనింగ్‌ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. క్లిష్టమైన మ్యాథమేటికల్‌ ఆల్గోరిథమ్‌ల కంప్యూటేషన్‌తో వర్చువల్‌ కాయిన్లను మైనింగ్‌ చేస్తుంటారు. క్రిప్టోలకు సంబంధించి అపరిమిత మైనింగ్‌కు అవకాశం లేకుండా పరిమితి ఉంటుంది.

బిట్‌కాయిన్‌లను 21 మిలియన్లకు మించి మైనింగ్‌ చేయకుండా సతోషి నకమొటో పరిమితి విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 6,000కు పైగా క్రిప్టోలున్నాయని అంచనా. మన దేశంలో సుమారు 10 కోట్ల మంది ఇప్పటికే క్రిప్టోల్లో పెట్టుబడులు కూడా పెట్టేశారు. క్రిప్టో ఇన్వెస్టర్ల పరంగా భారత్‌ మిగతా దేశాలను వెనక్కి నెట్టేసింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య 2.74 కోట్లుగానే ఉంది. మొత్తం జనాభాలో క్రిప్టో ఇన్వెస్టర్ల శాతం (7.30) పరంగా భారత్‌ ఐదో స్థానంలో ఉంది. ఉక్రెయిన్‌ 12.73 శాతంతో మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.

భారతీయుల క్రిప్టో పెట్టుబడులు సుమారు 10 బిలియన్‌ డాలర్లు (రూ.75,000 కోట్లు) చేరి ఉంటాయని ఒక అంచనా. మనదేశంలో సుమారు 100కు పైనే క్రిప్టో కాయిన్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్, ఎథీరియమ్, టెథర్‌ (యూఎస్‌డీటీ), షిబా ఇను, డోజికాయన్, పాలీగాన్‌ (మ్యాటిక్‌), కార్డనో, సొలాన, పోల్కడాట్, లైట్‌కాయిన్‌ వీటికి మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ ఆదరణ ఉంది.  కాయిన్‌ డీసీఎక్స్, వాజిర్‌ఎక్స్, యునోకాయిన్, కాయిన్‌స్విచ్‌ కుబేర్, జెబ్‌పే సంస్థలు మన దేశంలో క్రిప్టో సేవలు అందిస్తున్నాయి. వీటి ల్లో వ్యాలెట్‌ను తెరిచి ట్రేడింగ్‌ చేసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు