టెస్లాకు అదిరిపోయే ట్విస్ట్‌ .. ఏమంటావ్‌ ఎలన్‌ మస్క్‌

28 Jul, 2021 11:27 IST|Sakshi

ఇండియాలో ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గిస్తే టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ కార్లను భారత్‌కు తీసుకువస్తామంటూ ఎలన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌పై చెలరేగిన దుమారం ఇంకా చల్లారలేదు. భారత ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌పై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వంలో ఉన్నతాధికారి చేసిన చేసిన ప్రకటన ఎలన్‌మస్క్‌ని ఇరుకున పడేలా చేసింది.

దీనికి ఓకేనా
తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్‌ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్‌ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పుతామని ప్రకటిస్తే అది సాధ్యం’ అంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపింది. అంతేకాదు ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని ఆ అధికారి చెప్పినట్టు ఈటీ వివరించింది. 

టెస్లా బేరాలు
విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి  40  వేల డాలర్లు  లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది. ప్రస్తుతం టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ కారు ధర మన కరెన్సీలో కోటి రూపాయలలకు పైగానేగా ఉంది. దిగుమతి సుంకం కలిపితే ఈ కారు ధర రెండు కోట్లు దాటుతుంది. దీంతో పన్ను మినహాయింపు కోరుతోంది టెస్లా కంపెనీ.

ఇరుక్కుపోయిన ఎలన్‌ మస్క్‌ 
టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ,  చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌కు దిమ్మ తిరిగే కౌంటర్‌ ఇండియా ఇచ్చింది. దీంతో  బాల్‌ ఎలన్‌ మస్క్‌ కోర్టులో పడినట్టయ్యింది. భారత ప్రభుత్వం వదిలిన ఫీలర్‌కి ఎలన్‌మస్క్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.  
 

మరిన్ని వార్తలు